ఒక పెన్ను, ఫైలుకు ఏపీ చరిత్రలో సుస్థిర స్థానం లభించింది. ఈ రెండింటినీ జాగ్రత్తగా ఉంచి, మ్యూజియంలో భద్రపరచాలని స్వయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మరి అంత విశిష్టత సదరు పెన్ను, ఫైలుకు ఎలా వచ్చిందా అన్న ఆసక్తి కలగడం సహజమే. దీని అసలు వెనుక కధేంటంటే… నవ్యాంధ్ర రాజధాని అమరావతిని ప్రపంచ అత్యున్నత నగరాల్లో ఒకటిగా నిర్మించాలని చంద్రబాబు భావిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమరావతి డిజైనింగ్, నిర్మాణాల కోసం ఆయన ఎందరితోనో భేటీ అయ్యి, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు నగరాలను పరిశీలించారు.
ఈ క్రమంలో చివరగా… సింగపూర్ ప్రభుత్వ భాగస్వామిగా ఉన్న సింపూర్ కన్సార్టయమ్ తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కూడా కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలో సీడ్ క్యాపిటల్ గా పేరు గాంచిన ఉద్దండరాయునిపాలెం, తాళ్లాయపాలెం, లింగాయపాలెం, మందడం గ్రామాలకు చెందిన 1691 ఎకరాల్లో స్టార్టప్ ఏరియాను సింగపూర్ కన్సార్టియం నిర్మించనుంది. ఈ మేరకు ఒప్పందాలు కూడా చేసుకున్నారు. ఈ ఒప్పందాలకు సంబంధించి సంతకాలు చేసిన తర్వాత… తాను సంతకం చేసిన ఈ పెన్నును, ఫైలును సీఆర్డీఏ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్ కు చంద్రబాబు ఇచ్చి… ఏపీ చరిత్రలో ఈ రెండింటికీ గొప్ప స్థానం ఉందని ఆయనకు తెలిపారు.
వీటిని చాలా జాగ్రత్తగా దాచి పెట్టాలని, రానున్న రోజుల్లో వీటిని మ్యూజియంలో భద్రపరచాలని సూచించారు. ఒప్పందాలు కుదుర్చుకునే సమయంలో చంద్రబాబుకు సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ఓ ప్రతిమను కానుకగా ఇవ్వగా, సదరు ప్రతిమను కూడా జాగ్రత్త చేయాలని అజయ్ జైన్ కు చంద్రబాబు చెప్పారు. చరిత్రలో నిలిచిపోయే వాటిని జాగ్రత్తగా కాపాడితే… మనం కూడా చరిత్రలో నిలిచిపోతామని జైన్ కు ముఖ్యమంత్రి చెప్పారు. సమావేశం ముగిసిన తర్వాత కూడా పెన్ను, ఫైలు గురించి జైన్ కు చంద్రబాబు మరోసారి గుర్తు చేసి, జాగ్రత్తలు చెప్పారు. దీనికి సమాధానంగా, “మీ ఆదేశాలను తూ.చ తప్పకుండాం పాటిస్తాం సార్” అంటూ అజయ్ జైన్ నవ్వుతూ అన్నారు.



