ఒక్కోసారి ఎన్నికలలో ప్రజలు ఏక పక్షంగా తీర్పు చెపుతుంటారు. 2014, 2019లో అదేవిదంగా చెప్పారు. ‘ఈసారి ఎన్నికలలో 175/25 సీట్లు మావే’ అని జగన్మోహన్ రెడ్డి గొప్పగా చెప్పుకుంటున్నా అటువంటి పరిస్థితి లేదని అందరికీ తెలుసు. ఉంటే అభ్యర్ధులలో ఇన్ని మార్పులు, చేర్పులు చేసుకునేవారే కాదు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వెనకే ఢిల్లీకి పరిగెత్తి ఉండేవారే కాదు.
ఈసారి టిడిపి, జనసేనలు కలిసి పోటీ చేస్తున్నందున వాటి విజయావకాశాలు గణనీయంగా పెరిగాయి. అదేవిదంగా గత 57 నెలలుగా ఇస్తున్న సంక్షేమ పధకాలు+దొంగ ఓట్లు+ఎన్నికలలో దౌర్జన్యాలు వగైరాలతో వైసీపి విజయావకాశాలు కూడా బాగానే ఉన్నాయి.
త్వరలో జరుగబోయే ఈ ఎన్నికలను జగన్ కురుక్షేత్ర మహా సంగ్రామంతో పోల్చారు. అంటే ఎన్నికలు ఏకపక్షం కాదని ఆయనే స్వయంగా ధృవీకరించారన్న మాట!
ఈసారి హోరాహోరీగా జరుగబోతున్న ఎన్నికలలో టిడిపి, జనసేనలు 150 సీట్లు గెలవడం లక్ష్యంగా పెట్టుకుని తదనుగుణంగా సీట్ల సర్దుబాట్లు చేసుకుని వ్యూహాలు అమలుచేయబోతున్నాయి.
అయితే జగన్ ‘వైనాట్ కుప్పం?’ అంటూ చంద్రబాబు నాయుడుని ఆయన నియోజకవర్గంలోనే ఓడించాలని పట్టుదలగా ఉన్నట్లే, టిడిపి కూడా జగన్‌ను పులివెందులలోనే ఓడించాలని చాలా పట్టుదలగా ఉంది.
అలాగే పులివెందులతో పాటు నగరి (మంత్రి రోజా), పుంగనూరు (పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి), గుడివాడ (కొడాలి నాని), గన్నవరం (వల్లభనేని వంశీ), మంగళగిరి (గంజి చిరంజీవి) నియోజకవర్గాలలో తప్పనిసరిగా వైసీపిని ఓడించాలని టిడిపి, జనసేనలు చాలా పట్టుదలగా ఉన్నాయి.
వైసీపికి కూడా ఈవిషయం చాలా బాగా తెలుసు. వీటితోపాటు టిడిపి, జనసేనల టార్గెట్ చేసుకున్నా మరికొన్ని నియోజకవర్గాలన్నిటిలో, అలాగే తాము టార్గెట్ చేసుకున్న టిడిపి, జనసేనల నియోజకవర్గాలలో భారీగా దొంగ ఓట్లు చేర్పించి, టిడిపి, జనసేనల సానుభూతిపరుల ఓట్లు తొలగించి వైసీపి యుద్ధానికి ‘సిద్ధం’ అంటోంది.
వైసీపిని ఓడించి అధికారంలోకి రావడం కంటే కూడా తమ టార్గెట్ నియోజకవర్గాలలో వైసీపిని ఓడించడమే వాటికి అతి పెద్ద సవాలు అని చెప్పవచ్చు.
ఈ పరిస్థితిలో వైసీపిని ఓడించి 150 సీట్లు సాధించడం టిడిపి, జనసేనలకు చాలా కష్టమే. ఒకవేళ అన్ని సీట్లు గెలుచుకోలేకపోయినా, ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడే సీట్ల కంటే కాస్త ఎక్కువే గెలుచుకోగలమనే గట్టి నమ్మకంతో ఉన్నాయి.
కానీ దొంగ ఓట్లు, ఓటర్ల జాబితాలలో అవకతవకలతో ఒక్క శాతం ఓట్లు తేడా కొట్టినా టిడిపి, జనసేనలకు ఓటమి తప్పదు. అందుకే అవి కేంద్ర ఎన్నికల కమీషన్‌కు పిర్యాదులు చేస్తూనే ఉన్నారు. కానీ శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదన్నట్లు… మోడీ, అమిత్ షాలు వద్దనుకుంటే కేంద్ర ఎన్నికల కమీషన్ కూడా పట్టించుకోదనే అందరికీ తెలిసిన రహస్యం.
అందుకే బీజేపీని కలుపుకు పోవడానికి టిడిపి, జనసేనలు సిద్దం అయ్యాయి. వెంటనే జగన్ కూడా ఢిల్లీలో వాలిపోయి మోడీ చెవిలో చెప్పాల్సింది చెప్పి వచ్చారు. కనుక ‘ఢిల్లీ శ్రీకృష్ణుడు’ ఏవైపు ఉంటాడో తేలిపోతే యుద్ధం ఏవిదంగా జరుగబోతోందో స్పష్టత వచ్చేస్తుంది.




