టిడిపి, జనసేనల త్యాగాలకు బీజేపీ నుంచి ఆశించేది అదొక్కటే

TDP JanaSena BJP Alliance Amit Shah Narendra Modi

టిడిపి, జనసేనల పొత్తులు, సీట్ల సర్ధుబాట్లపై బయటి వ్యక్తులు ఇంకా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ, ఆ రెండు పార్టీల నేతలు కలిసికట్టుగా ముందుకు సాగుతుండటం గమనిస్తే, వాటి మద్య బలమైన బంధం ఏర్పడిందని స్పష్టమవుతోంది.

ADVERTISEMENT

వాటిపై ప్రజలకు నమ్మకం కలగాలంటే ఇది చాలా అవసరం కూడా. రెండు పార్టీలు కలిసి ఏర్పాటు చేసుకున్నా సమన్వయకమిటీ గురువారం విజయవాడలో సమావేశమైంది. ఇంకా బీజేపీతో పొత్తులు, సీట్ల సర్దుబాట్లపై చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌ బీజేపీ పెద్దలతో మాట్లాడుతున్నందున, ఈ సమావేశంలో టిడిపి, జనసేనల సీట్ల సర్దుబాట్ల గురించి చర్చించలేదు.

ఉమ్మడి మ్యానిఫెస్టో, భవిష్య కార్యాచరణ గురించి మాత్రమే ఈ సమావేశంలో చర్చించారు. టిడిపి, జనసేనలు రెండూ కూడా అమరావతికి కట్టుబడి ఉన్నాయి. పరిశ్రమలు, పెట్టుబడులు, ఐ‌టి కంపెనీలు, ఉద్యోగాల కల్పన విషయంలో రెండు పార్టీలు ఒకేలా ఆలోచిస్తున్నాయి.

అలాగే రాష్ట్రాభివృద్ధి, సంక్షేమ పధకాల విషయంలో కూడా ఇంచుమించు ఒకే విదంగా ఆలోచిస్తున్నాయి. కనుక ఉమ్మడి మ్యానిఫెస్టో రూపకల్పనకు పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు.

భవిష్య కార్యాచరణపై జరిగిన చర్చలలో ఈ నెల 28న తాడేపల్లిగూడెంలో టిడిపి, జనసేనల కలిసి భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించిన్నట్లు తెలుస్తోంది. ఆలోగా బీజేపీతో పొత్తులు, సీట్ల సర్దుబాట్లు కూడా పూర్తయితే, బీజేపీ కూడా ఆ సభలో పాల్గొనే అవకాశం ఉంటుంది. అప్పుడే సీట్ల సర్దుబాట్లపై మూడు పార్టీలు నిర్ధిష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉంది.

కానీ బీజేపీతో పొత్తులు విషయం ఇంకా తేల్చుకోలేకపోతే ఎక్కువ నష్టపోయేది టిడిపి, జనసేనలే. ఈవిషయంలో ఆలస్యం అవుతున్న కొద్దీ టిడిపి, జనసేనలలో టికెట్స్ ఆశిస్తున్నవారిలో నానాటికీ ఆందోళన పెరుగుతూనే ఉంటుంది. దానిని వైసీపి అవకాశంగా మలుచుకొని టిడిపి, జనసేనల మద్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తూనే ఉంటుంది. కనుక వీలైనంత త్వరగా బీజేపీతో పొత్తు విషయం తేల్చుకోవడం చాలా అవసరం.

ఒకవేళ వాటితో పొత్తుకి బీజేపీ సిద్దపడినా, ఎన్నికల సమయంలో కేంద్రం నుంచి అవి ఆశిస్తున్న సహాయసహకారాలు అందిస్తేనే ఏమైనా ఉపయోగం ఉంటుంది. లేకుంటే బీజేపీ కోసం టిడిపి, జనసేనల త్యాగాలు వృధా అవుతాయి.

ఈ ఎన్నికల కోసమే జగన్‌ ప్రభుత్వం వాలంటీర్, సచివాలయ వ్యవస్థలను సృష్టించుకుంది. వాటిని ఎన్నికలకు దూరంగా ఉంచాలని ఈసీ హెచ్చరిస్తున్నా, సిఎం జగన్‌తో సహా మంత్రులు అందరూ ఎన్నికలలో వాలంటీర్లు చాలా కీలకం అని బహిరంగంగానే చెపుతుండటం అందరూ వింటూనే ఉన్నారు.

కనుక ఒకవేళ టిడిపి, జనసేనలతో బీజేపీ కలిస్తే, ముందుగా కేంద్ర ఎన్నికల కమీషన్‌ ద్వారా వాలంటీర్లను, సచివాలయ సిబ్బందిని ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంచుతూ, ఎన్నికలలో వైసీపి పెట్రేగిపోకుండా చూడాల్సి ఉంటుంది. లేకుంటే వైసీపిని గెలిపించడం కోసం టిడిపి, జనసేనలతో పొత్తు పెట్టుకున్నట్లు అనుమానించాల్సి వస్తుంది.

ADVERTISEMENT
Latest Stories