చంద్రబాబు నాయుడు అరెస్ట్, టిడిపి నేతలపై కేసుల విషయంలో ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు కలుగజేసుకొనే ఉద్దేశ్యం లేదని స్పష్టమైపోయింది.
చంద్రబాబు నాయుడుకి వరుసగా కోర్టులలో ఎదురుదెబ్బలు తగులుతుండటం, జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత కొత్త కేసులు నమోదవుతుండటమే ఇందుకు నిదర్శనంగా భావించవచ్చు.
కనుక మోడీ, అమిత్ షాలు వైసీపి, జగన్మోహన్ రెడ్డి వైపే మొగ్గు చూపుతున్నట్లు కూడా స్పష్టమైపోయింది. ఇంతకాలం వారిరువురూ చంద్రబాబు నాయుడు అరెస్టుపై స్పందించకపోవడానికి కారణం కూడా ఇదే అని భావించవచ్చు.
‘శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు’ కనుక చంద్రబాబు నాయుడుకి ఇప్పట్లో బెయిల్ లభించే అవకాశం లేనట్లే భావించవచ్చు. అలాగే నారా లోకేష్‌తో సహా మరికొంత మంది టిడిపి నేతలు కూడా జైలుకి వెళ్ళవలసి రావచ్చు. నెలరోజులుగా చంద్రబాబు నాయుడుకి ఎదురవుతున్న అనుభవాలే వారికీ ఎదురవవచ్చు. కనుక టిడిపి నేతలందరూ ఈ పరిణామాలకు సిద్దపడక తప్పదు.
టిడిపి పట్ల మోడీ, అమిత్ షాల వైఖరి ఏమిటో స్పష్టమైంది కనుక ఇక టిడిపి, జనసేనలు కూడా రాజకీయ నిర్ణయం తీసుకోవలసిన సమయం వచ్చింది. ఇంకా మోడీ, అమిత్ షాల కటాక్షం కోసం ఎదురుచూపులు చూస్తూ విలువైన సమయం వృధా చేసుకోకుండా వీలైననంత త్వరగా రాష్ట్రంలో వామపక్షాలతో, అదేవిదంగా జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో చేరడం మంచిదనిపిస్తోంది.
తద్వారా ఈ కేసుల నుంచి వారికి ఉపశమనం లేదా రక్షణ లభించవు కానీ కాంగ్రెస్, వామపక్షాలు కూడా కలిస్తే రాష్ట్రంలో టిడిపి, జనసేనల కూటమి మరింత బలపడుతుంది. కాదని ఇంకా మీనమేషాలు లెక్కబెట్టుకొంటూ కూర్చొంటే, వైసీపి చకచకా పావులు కదుపుతూ, టిడిపి, జనసేనలకు అన్ని మార్గాలు మూసివేయడం ఖాయం.
కనుక టిడిపి, జనసేనలు తక్షణం రాజకీయ నిర్ణయం తీసుకోవడం చాలా అవసరం. అలాగే వీలైనంత త్వరగా సీట్ల సర్ధుబాట్లు చేసుకొని ప్రజల మద్యకు వెళితే ప్రజలకు కూడా వాటిపై నమ్మకం పెరుగుతుంది.



