రాష్ట్ర విభజన తర్వాత కూడా తెలంగాణలో టిడిపి బలంగానే ఉండేది. అయితే టిడిపిని ఎంతగానో ద్వేషించే కేసీఆర్, తెలంగాణలో తన పార్టీని బలోపేతం చేసుకొనేందుకు పలువురు బలమైన టిడిపి నేతలను, ఎమ్మెల్యేలను తన పార్టీలోకి ఫిరాయింపజేసుకొన్నారు.
కాంగ్రెస్ పార్టీయే తెలంగాణకు మొట్టమొదటి శత్రువు. దాని వలననే తెలంగాణకు దుర్గతి పట్టిందని కేసీఆర్, కేటీఆర్ ఎన్నికల ప్రచార సభలలో ఆక్షేపిస్తుంటారు. కానీ అదే కాంగ్రెస్ పార్టీకి చెందిన కాంగ్రెస్ నేతలను పార్టీలో చేర్చుకొంటుంటారు. కనుక బిఆర్ఎస్ పార్టీలో తెలంగాణ ఉద్యమకారుల కంటే కాంగ్రెస్, టిడిపి నేతలే ఎక్కువమంది ఉన్నారు.
ఇవాళ్ళ మాజీ టిడిపి ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారు. తెలంగాణ టిడిపిలో రావుల చాలా సీనియర్ నాయకుడు. ఒకవేళ ఆయన కూడా మొదటే మిగిలినవారితో కలిసి బిఆర్ఎస్ పార్టీలో చేరిపోయి ఉంటే, నేడు ఆయన గురించి చెప్పుకోవలసిన అవసరమే ఉండేదే కాదు.
కానీ ఈసారి తెలంగాణ శాసనసభ ఎన్నికలలో టిడిపి 87 స్థానాలకు పోటీకి సిద్దమవుతోందని రాష్ట్ర టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ప్రకటించిన తర్వాత పార్టీకి రాజీనామా చేసి బిఆర్ఎస్‌లో చేరుతున్నందునే చెప్పుకోవలసి వస్తోంది. టిడిపి హయాంలో ఎమ్మెల్యే, ఎంపీ, చీఫ్ విప్ పదవులు చేపట్టిన రావుల ఇంతకాలం టిడిపిలోనే కొనసాగుతూ, ఎన్నికల సమయంలో పార్టీ మారాలనుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఇదివరకే బిఆర్ఎస్‌లో చేరిన టిడిపి మాజీ అధ్యక్షుడు ఎల్ రమణ, ఎర్రబెల్లి దయాకర్ రావు ఇద్దరూ రావులతో సంప్రదింపులు జరిపి ఆయన మహబూబ్ నగర్ నుంచి లోక్‌సభకు పోటీ చేయాలనుకొంటున్నారనే విషయం కేసీఆర్, కేటీఆర్‌కి తెలిపారు.
ఈరోజు రావుల బిఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నందున ఆయనకు మహబూబ్ నగర్ లోక్‌సభ టికెట్‌కు కేసీఆర్ హామీ ఇచ్చిన్నట్లే భావించవచ్చు. ఒకవేళ రావులకి ఈ టికెట్ కేటాయిస్తే సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి పరిస్థితి ఏమిటి?




