కార్యకర్తలు కదిలారు… ఇక నాయకులే దిగి రావాలి..!

Chandrababu-naidu-2019 ఎన్నికలలో ఘోర ఓటమి పాలైన తర్వాత ఇంకా తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ లో మనుగడ సాగిస్తుందా? లేదా? అన్న ప్రశ్నలు చాలా సందర్భాలలో ఉత్పన్నం అయ్యాయి. దీనిపై పలు ఛానల్స్ లో డిబేట్స్ కూడా జరిగాయి. నిజమే… అంత నైరాశ్యతలో కార్యకర్తలు మరియు టిడిపి అధిష్టానం ఉంది.

ADVERTISEMENT

కానీ కింద పడిన ప్రతిసారి పైకి లేవడం టిడిపికి కొత్తేమీ కాదు. నాడు వైఎస్సార్ హయాంలో కూడా తెలుగుదేశం పార్టీ పనైపోయిందన్న టాక్ వచ్చింది. టీడీపీలోని ప్రధాన నాయకులందరినీ ఒక్కొక్కరిగా వైఎస్సార్ తన వైపుకు తిప్పుకుంటున్న తరుణంలో… ఇక టిడిపి మనుగడ అసాధ్యం అని బహిరంగంగానే చర్చలు జరిగాయి. కానీ ఆ తర్వాత జరిగిన పర్యవసానాలు అందరికీ తెలిసినవే.

గత ఎన్నికల ఓటమి తర్వాత మానసికంగా కృంగిపోయిన తెలుగుదేశం పార్టీకి గడిచిన రెండు, మూడు నెలలుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఊపునిచ్చాయి. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పసుపు జెండా పట్టుకుని రోడ్డు మీద బయటకు రావడానికి భయపడిన తెలుగుదేశం కార్యకర్తలు నేడు పసుపు జెండాలతో రాష్ట్ర వీధులను నింపేస్తున్నారు.

ముఖ్యంగా ఓటీఎస్ పధకంపై నిరసన గళం విప్పిన టిడిపి కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలలో రోడ్డెక్కి తమ నిరసనను తెలియజేసారు. ఈ పరిణామం పార్టీ క్యాడర్ ను ఒక్కసారిగా అలర్ట్ చేయడంతో పాటు, జగన్ కు ఎదురొడ్డి నిలవొచ్చన్న విశ్వాసాన్ని పార్టీ అభిమానులకు, కార్యకర్తలకు కలిగించింది.

ఓటీఎస్ పై పోరాటంలో టిడిపి కార్యకర్తలు, అభిమానులు వాళ్ళ శక్తికి మించి పాల్గొన్నారు. ఇక మిగిలింది నాయకుల వంతు! మైక్ ముందు కూర్చుని ప్రభుత్వంపై ఎన్ని విమర్శలు చేసినా అవి ప్రజలలో కలిగించే ప్రభావం ఒక స్థాయి వరకే పరిమితం అవుతుంది. కానీ అదే విషయాలను రోడ్డెక్కి నిరసన ద్వారా తెలియజేస్తే వచ్చే ఫలితాలు వేరుగా ఉంటాయి.

తెలుగుదేశం ప్రధాన నాయకులు కూడా రంగంలోకి దిగి వైసీపీని బలంగా ఎదుర్కొంటే, ప్రస్తుతం కార్యకర్తలలో ఉన్న ఉత్సాహం మరింత రెట్టింపవుతుంది. ఆ ప్రభావం అప్పటికప్పుడు తెలియకపోవచ్చు గానీ, పార్టీ భవిష్యత్తుకు అత్యంత కీలకంగా మారుతుందని చెప్పడంలో సందేహం లేదు. అలాగే వైసీపీని ఢీ కొట్టేందుకు కార్యకర్తలలో వచ్చిన విశ్వాసాన్ని కూడా మరింతగా పెంపొందించిన వారవుతారు.

నిజానికి గత ఎన్నికలలో ఈ విధానమే లోపించి టిడిపి నేతలు ఓటమి పాలయ్యారు. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు గానీ, వాటిని నివృత్తి చేసేందుకు గానీ తెలుగుదేశం ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండడం లేదన్న నివేదికలే పార్టీని కొంప ముంచాయి. ఇప్పుడైనా వాటిని సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళకపోతే, టిడిపి భవిష్యత్తు ప్రశ్నార్ధకం అయ్యే సూచనలు స్పష్టంగా కనపడుతున్నాయి.

ADVERTISEMENT
Latest Stories