తెలంగాణ సిఎం కేసీఆర్ పక్కనే ఉన్న తెలుగు రాష్ట్రం ఆంధ్రాని, దక్షిణాది రాష్ట్రాలను కాదని ఉత్తరాది రాష్ట్రాలవైపు పయనిస్తుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. అయితే కేసీఆర్ లెక్కలు వేరే ఉంటాయని అందరికీ తెలుసు.
ఏపీలో ప్రజలందరూ వెయ్యి కళ్ళతో తన కోసం ఎదురుచూస్తున్నారని గొప్పగా చెప్పుకొనే కేసీఆర్ ఏపీలో ఎందుకు రావడం లేదో అందరికీ తెలుసు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఇరుక్కొన కుమార్తె కవితని కాపాడుకోవడం కోసం కర్ణాటకలో మిత్రులు దేవగౌడ, కుమారస్వామికి హ్యాండిచ్చారు.
తమిళనాడులో డిఎంకే, అన్నాడిఎంకే పార్టీలను తప్ప మరో పార్టీని ప్రజలు పట్టించుకోరు. కేరళలో కూడా కాంగ్రెస్, వామపక్ష కూటమిలను తప్ప మరో పార్టీని పట్టించుకోరు. కనుక దక్షిణాది రాష్ట్రాలలో కేసీఆర్ ముందుకు సాగలేని పరిస్థితులున్నాయి. కనుక తెలంగాణను ఆనుకొని ఉన్న మహారాష్ట్రలో ప్రవేశించారు.
కేసీఆర్ మహారాష్ట్రను ఎంచుకోవడానికి బలమైన కారణాలే ఉన్నాయి. మహారాష్ట్రని పాలించిన కాంగ్రెస్, బిజెపి, శివసేన పార్టీలు రైతులకు మేలు చేయలేకపోయాయి. కానీ తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుతో మూడు పంటలకు నీళ్ళు అందిస్తూ, రైతులకు ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుభీమా వంటి అనేక పధకాలు అమలుచేసి చూపారు. ఇవన్నీ పొరుగునే ఉన్న మహారాష్ట్రలో గ్రామీణులు కళ్ళారా చూస్తున్నారు. చూడనివారికి కేసీఆర్ చూపిస్తున్నారు.
రాజకీయంగా చూస్తే మహారాష్ట్రలో కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీలు బలహీనంగా మారాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పట్ల రాష్ట్రంలో రైతులు అసంతృప్తిగా ఉన్నారు. కనుక మహారాష్ట్రలో బిఆర్ఎస్‌కు చాలా అనుకూలమైన వాతావరణం ఉంది కనుక కేసీఆర్ అటువైపు ప్రయాణం ప్రారంభించారనుకోవచ్చు.
సంక్రాంతి పండుగ తర్వాత దేశమంతటా పార్టీని విస్తరించి, అన్ని రాష్ట్రాలలో ఎన్నికలలో పోటీ చేసి నా తడాఖా చూపిస్తానని గొప్పలు చెప్పుకొన్న కేసీఆర్, మహారాష్ట్రకే పరిమితమవడానికి మరో బలమైన కారణం కూడా ఉంది. కేసీఆర్ ఏకైక స్నేహితుడు ఆమాద్మీ అధినేత ఢిల్లీ సిఎం కూడా ఇలాగే తన శక్తిని అతిగా ఊహించుకొని, అన్ని రాష్ట్రాలలో పోటీ చేసి చేతులు కాల్చుకొన్నారు.
కనుక ఆ అనుభవంతో పక్కనే ఉన్న రాష్ట్రాలలో అనుకూల పరిస్థితులున్న పంజాబ్‌పై మాత్రమే గట్టిగా దృష్టి పెట్టి పనిచేస్తే అక్కడ ఆమాద్మీ అధికారంలోకి వచ్చింది. బహుశః ఆయన సలహా మేరకే కేసీఆర్ కూడా అదే ఫార్ములాని ఫాలో అవుతూ తనకు అత్యంత అనుకూలంగా ఉన్న మహారాష్ట్రాలోకి ప్రయాణం మొదలుపెట్టారనుకోవచ్చు.
ఇప్పటికే 3-4సార్లు మహారాష్ట్రలో సభలు నిర్వహించిన కేసీఆర్, సోమవారం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను వెంటబెట్టుకొని వందల కార్లలో మహారాష్ట్రలోని ధారశివ, సోలాపూర్ జిల్లాల పర్యటనకు బయలుదేరారు. మళ్ళీ రేపు హైదరాబాద్ తిరుగుప్రయాణం అవుతారు.



