పదేళ్లు అధికారం అనుభవించి పట్టుమని పది నెలలు కూడా ప్రతిపక్షంలో కూర్చోలేక తీవ్ర ఇబ్బందులు పడుతోన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, తన గంపెడాశలన్నీ జగన్ మోహన్ రెడ్డి పైనే పెట్టుకున్నారని తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ మీడియా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
ఏబీఎన్ రాధాకృష్ణ నిర్వహించిన ముఖాముఖీలో వర్తమాన రాజకీయ పరిస్థితులపై పలు కీలక విషయాలను చెప్పుకొచ్చారు రేవంత్. “త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని, మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని” కేసీఆర్ చేస్తోన్న వ్యాఖ్యలపై తనదైన శైలిలో రేవంత్ స్పందించారు.
ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ జగన్ అధికారంలోకి వచ్చి, పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ఒత్తిడి తీసుకువచ్చి, తద్వారా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చివేస్తారని కేసీఆర్ భావిస్తున్నట్లుగా రేవంత్ అన్నారు. అందుకనే వస్తోన్న సర్వేలకు విరుద్ధంగా జగన్ కు దోహదం చేయాలనే ఉద్దేశంతో, ఏపీలో జగన్ వస్తారని తన మీడియాలో కేసీఆర్ చెప్పుకుంటున్నారని తెలిపారు.
పొరుగు రాష్ట్రంలో అధికారంలోకి ఎవరొచ్చినా తనకేమి ఇబ్బంది లేదని, తనకు వస్తోన్న సమాచారం మేరకు ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ గడ్డు పరిస్థితిని ఎదుర్కోబోతున్నట్లుగా తెలిసిందన్న రేవంత్, తెలంగాణాలో కాంగ్రెస్ కు లెక్కకు మించిన బలముందని, ఇంకా చెప్పాలంటే మరో 10-12 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి రావడానికి సిద్ధమని, కేసీఆర్ వి పగటి కలలేనని తేల్చేసారు.
ఇక ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి కూడా సంచలన విషయాలను రేవంత్ చెప్పుకొచ్చారు. దేశభద్రతకు సంబంధించిన సమాచారం ఉన్న హార్డ్ డిస్క్ లు మాయం మరియు ధ్వంసం చేసిన దర్యాప్తులో భాగంగా మొదలుపెట్టిన పరిశోధనలో ఈ ఫోన్ ట్యాపింగ్ వెలుగు చూసిందని, ప్రస్తుత ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత విచారణ వేగవంతం అవుతుందని అన్నారు.
తాను అధికారులకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చానని, తాము చేసిన వాగ్ధానాలను నిలుపుకోవడం మరియు తెలంగాణా అభివృద్ధి మినహా తన దృష్టి ఇతర అంశాలపై లేదని, నా ప్రభుత్వం కూలద్రోసే స్థితికి వస్తే, ఏం చేయాలో తనకు తెలుసని సున్నితంగానే రాజకీయ ప్రత్యర్థులకు ఓ విధమైన హెచ్చరిక కూడా చేసారు రేవంత్ రెడ్డి.
వాస్తవ పరిస్థితులేమిటంటే… కేసీఆర్, జగన్ ఇద్దరూ ఒకే నావ మీద పయనించే వ్యక్తులుగా అభివర్ణించవచ్చు. తెలంగాణా ఎన్నికలలో కేసీఆర్ కు అనుకూలంగా జగన్ పావులు కదిపినా, అవి ఏ మాత్రం పారలేదు. ప్రస్తుతం కేసీఆర్ పరిస్థితి కూడా అంతే! సొంత రాష్ట్రంలో అభివృద్ధిని కాంక్షించి ఉంటే, పొరుగు రాష్ట్ర రాజకీయాలపై ఆధారపడే దుస్థితికి నేడు జగన్, ఆనాడు కేసీఆర్ చేరుకునేవారు కాదు.




