కేంద్రంలో అధికారం కోసం ఎన్డీయే ప్రభుత్వం పై ముఖ్యంగా బీజేపీ పై రాహుల్ గాంధీ చేస్తున్న రాజకీయంలో దూకుడు పెరిగిన మాట వాస్తవం. భవిష్యత్ లో జరగబోయే ఎన్నికలలో ఎన్డీయే ను గద్దె దింపి రాహుల్ నాయకత్వంలో ఇండియా కూటమిని అధికారంలోకి తెచ్చేందుకు రాహుల్ బీజేపీ వ్యతిరేక శక్తులన్నింటిని ఒకతాటి మీదకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి వేరుపడిన పాత రాజకీయ బంధాలను కూడా దగ్గరకు చేర్చుకోవాలని ఆశపడుతున్నారు. ఇటువంటి తరుణంలో రాహుల్ గాంధీకి ముందుగా తన పార్టీ నేతల మీద పట్టు కావాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ నాయకుల మధ్య సఖ్యత చూడాలి.
రాహుల్ ప్రధాని కావాలి అంటే అది కేవలం మిత్ర పక్షాల రాజకీయ బలంతోనే సాధ్యం కాదు. కాంగ్రెస్ పార్టీ కూడా రాష్ట్ర స్థాయిలో అంతే బలంగా ఉండాలి, తన బలాన్ని నిరూపించుకోవాలి. ఇప్పటికే దేశంలో చాల రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా కనుమరుగయిపోతూ వస్తుంది.
ఈ నేపథ్యంలో కనీసం అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అయినా కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రాగలిగితే అది రాహుల్ గాంధీ నాయకత్వానికి మరింత బలంగా మారుతుంది. తెలంగాణ వంటి రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వాన కాంగ్రెస్ అధికారంలోకి రాగలిగింది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మూడేళ్లకే కాంగ్రెస్ నేతల అంతర్గత రచ్చలు, పదవి కాంక్షలు కాంగ్రెస్ అధికారాన్ని మూన్నాళ్ళ ముచ్చటగా మార్చేస్తున్నారు. రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి రావడం సంగతి అటుంచితే ప్రస్తుతం చేతిలో ఉన్న అధికారాన్ని కూడా నిర్దిష్ట ఐదేళ్ల సమయం వరకు సక్రమంగా వినియోగించుకుంటారా లేదా అన్న సందేహాలు కలుగుతున్నాయి.
మొన్న మాజీ మంత్రి కొండా సురేఖ వ్యవహారం, నిన్న మేడ్చల్ ఎమ్మెల్యే అనిరుథ్ రెడ్డి వ్యాఖ్యలు, నేడు మంత్రి శ్రీధర్ బాబు – ఎంపీ గడ్డం వంశీ కృష్ణ వివాదం, ఇక తాజాగా మంత్రి దామోదర్ రాజనర్సింహ – ఎమ్మెల్యే లక్ష్మి కాంతారావు మధ్య విభేదాలు….ఇలా టి.కాంగ్రెస్ లో రోజురోజుకి అంతర్గ విభేదాలు రచ్చకెక్కుతున్నాయి.
ఇక తన మంత్రి పదవి కోసం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రేవంత్ సర్కార్ పాలిట చెవిలో దూరిగలా వేధిస్తూనే ఉంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కు తెలంగాణలో అధికారం సాధించడానికి దాదాపు దశాబ్ద కాలం పట్టింది.
కానీ ఆ వచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసుకోవడానికి రెండున్నరేళ్ల సమయమే సరిపోతుంది అనేలా టి. కాంగ్రెస్ నేతల వ్యహారశైలి కనిపిస్తుంది. ఇలా అధికారం లో ఉన్న రాష్ట్రాలలో పార్టీ నేతల మధ్య అంతర్గత విభేదాలు, వివాదాలు రచ్చ లేపుతుంటే రేపటి రోజున కాంగ్రెస్ ఆ రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందా.? ప్రత్యర్థి పార్టీలు ఇస్తాయా.?
ఇటువంటి తరుణంలో దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ అన్న కాంగ్రెస్ నేతల ఆశ నెరవేరే అవకాశం ఉంటుందా.? సొంత పార్టీ నేతల మధ్యే సఖ్యత తేలేని, సమన్వయం చెయ్యలేని నాయకత్వాన్ని నమ్మి ఇతర పార్టీలు రాహుల్ నాయత్వానికి మద్దతు తెలుపుతాయా.?





