కాంగ్రెస్, బిజెపి అధిష్టానాలు తీసుకొంటున్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ఆ రెండు పార్టీలు బలపడేలా ఉండాలి. కానీ వాటి నిర్ణయాలు, వైఖరే రాష్ట్ర కాంగ్రెస్, బిజెపిలకు శాపాలుగా మారుతుండటం విశేషం.
బండి సంజయ్ నేతృత్వంలో తెలంగాణ బిజెపి దూసుకుపోతూ, కేసీఆర్‌ను గద్దె దించగలదనే నమ్మకం పార్టీ శ్రేణుల్లో, ప్రజలలో కూడా కల్పించగలిగింది. శక్తివంతమైన కేసీఆర్ ప్రభావం తెలంగాణ అంతటా బలంగా ఉన్నప్పుడూ, మరో పార్టీ కేసీఆర్‌ని ఓడించి అధికారంలోకి రాగలదనే ఆలోచన కలిగించడమే చాలా గొప్ప విషయం. అది బండి సంజయ్ కలిగించారు.
బిజెపి అధిష్టానం కూడా ఈసారి తెలంగాణలో తప్పకుండా అధికారంలోకి రావాలని చాలా పట్టుదలగా ఉంది. కనుక ఇటువంటి అనుకూల వాతావరణం సృష్టించిన బండి సంజయ్‌కి అన్నివిధాలా అండగా నిలిచి, పార్టీపై ప్రజలకు మరింత నమ్మకం ఏర్పడేలా చేసేందుకు తోడ్పడి ఉండాలి. కానీ ఆయనను పదవిలో నుంచి తప్పించేసి మృధుస్వభావిగా పేరున్న కిషన్‌రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగించింది.
దీంతో ఒక్కసారిగా తెలంగాణలో బిజెపి పరిస్థితి తారుమారైపోయింది. ఇంతకాలం బిజెపి, బిఆర్ఎస్ పార్టీల గురించే అందరూ చర్చించుకొనేవారు. కానీ ఇప్పుడు బిజెపిని ఎవరూ పట్టించుకోవడం లేదు. కనీసం బిజెపిలో చేరేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు!
బండి సంజయ్ బిజెపిని ఎన్నికలలో గెలిపించి పార్టీని అధికారంలో తెస్తారా లేదా అనేది తర్వాత సంగతి. కానీ కనుచూపు దూరంలో అటువంటి అవకాశం కనిపిస్తున్నప్పుడు బిజెపి అధిష్టానం దానిని చేజేతులా పాడుచేసుకొందని చెప్పక తప్పదు.
ఇక తెలంగాణలో బిజెపి స్వయంవినాశనం చేసుకోవడంతో రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్ళీ పుంజుకొని రెండోస్థానంలోకి వచ్చేసింది. కేసీఆర్, బిఆర్ఎస్ మంత్రులు అందరూ బిజెపిని వదిలేసి కాంగ్రెస్‌పై పడుతుండటం గమనిస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకొందని అర్దమవుతోంది. ఈ క్రెడిట్ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికే దక్కుతుంది.
పార్టీలో సీనియర్ నేతలు ఆయన నాయకత్వాన్ని ఎంతగా వ్యతిరేకిస్తున్నప్పటికీ, రేవంత్ రెడ్డి పార్టీని పరుగులు పెట్టిస్తూ, ఎట్టకేలకు బిఆర్ఎస్‌కు కాంగ్రెస్ పార్టీయే ప్రత్యామ్నాయమనే భావన ప్రజలలో కల్పించగలిగారు. సరిగ్గా ఇటువంటి సమయంలో కాంగ్రెస్ అధిష్టానం షర్మిలను దింపేందుకు సిద్దమైంది.
తెలంగాణ కాంగ్రెస్‌లో ఆమెకు చోటు లేదని రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగానే చెప్పారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం ఆమెకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.
ఆమె దాదాపు రెండేళ్ళుగా తెలంగాణలో పాదయాత్రలు చేస్తున్నప్పుడు ‘తాను రాజన్న బిడ్డనని, రాజన్న రాజ్యం తెస్తాననే’ చెప్పుకొని తిరిగారు. అందుకే తెలంగాణ ప్రజలు ఆమెను పరాయిదానిగానే చూశారు. కనుక ఆమెను తెలంగాణ కాంగ్రెస్‌లో తీసుకొంటే, కేసీఆర్ తప్పకుండా తెలంగాణ సెంటిమెంట్‌తో కాంగ్రెస్‌ను దెబ్బ తీస్తారని రేవంత్ రెడ్డి వాదిస్తున్నారు.
గత ఎన్నికలలో కాంగ్రెస్, టిడిపితో పొత్తుపెట్టుకొన్నప్పుడు కూడా కేసీఆర్ ఇలాగే చంద్రబాబు నాయుడుని బూచిగా చూపించి కాంగ్రెస్‌ను దెబ్బ తీశారు. ఈసారి షర్మిలను చూపి దెబ్బ తీస్తారనే రేవంత్ రెడ్డి వాదనలు అరణ్యరోదనగానే మిగిలిపోయాయి.
ఈవిదంగా జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బిజెపిలు తెలంగాణలో సెల్ఫ్ డిస్ట్రక్షన్ చేసుకొని, రాష్ట్ర నేతల 5 ఏళ్ళ కష్టాన్ని ఏటిపాలు చేస్తున్నాయని చెపొచ్చు.





