పోరాటాలతో తెలంగాణ… ఆరాటాలతో ఆంద్రా పాలకులు

KCR - Jaganఏపీ, తెలంగాణ, తమిళనాడు మరే రాష్ట్రంలో ప్రజాలైన తమ హక్కుల కోసం పోరాడుతూనే ఉంటారు. అయితే పాలకులకు కూడా రాష్ట్ర ప్రయోజనాల పట్ల చిత్తశుద్ధి, నిబద్దత ఉంటే ఆ పోరాటాలు ఫలిస్తాయి.

ఉదాహరణకు ఏపీకి ప్రత్యేకహోదా, విశాఖ రైల్వేజోన్, పారిశ్రామిక కారిడార్ వంటి అనేక అంశాలలో పాలకులు కేంద్రంతో రాజీపడటం వలన ప్రజాపోరాటాలు బూడిదలో పోసిన పన్నీరయ్యాయి. పైగా కేంద్ర ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మేస్తోంది కూడా. అయినా అడ్డుకోవాలనుకోవడం లేదు. కారణాలు అందరికీ తెలిసినవే.

ADVERTISEMENT

అదే… తెలంగాణలో విభజన హామీలతో సహా ఇంకా అనేక ఇతర అంశాలపై కేసీఆర్‌ ప్రభుత్వం నిరంతరం కేంద్రంతో పోరాడుతూనే ఉంటుంది. కనుకనే రెండు అతిభారీ ప్రాజెక్టులు కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులకు అన్ని అనుమతులు వచ్చాయి. చకచకా వాటిని నిర్మించేసుకొంది కూడా.

సికింద్రాబాద్‌-మనోహరాబాద్ రైల్వే మార్గం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తుండటంతో ఏటా బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయిస్తోంది. అప్పుడే ఆ ప్రాజెక్టులో 50-60 శాతంపైగా పూర్తవడంతో సిద్ధిపేట నుంచి ప్యాసింజర్ రైళ్ళు తిరగడం కూడా మొదలైపోయాయి.

విభజన హామీలలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తోంది. రాష్ట్రంలో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలనే తెలంగాణ ప్రభుత్వం డిమాండ్‌కు కేంద్రం తలొగ్గింది. తెలంగాణ ప్రభుత్వం ఒత్తిడికి తలొగ్గి కృష్ణానదీ జలాలలో రెండు రాష్ట్రాల వాటాలను మళ్ళీ పునః పరిశీలించేందుకు అంగీకరించింది.

ఇలా చెప్పుకొంటూ పోతే తెలంగాణ పాలకులు కేంద్రంతో నిరంతరం పోరాడి సాధించుకొన్నవి ఎన్నెన్నో ఉన్నాయి. అయినా ఇంకా రావలసిన వాటి కోసం పోరాడుతూనే ఉంది.

రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకోవాలనే తపన, తాపత్రయం ముఖ్యమంత్రి కేసీఆర్‌ మొదలు మంత్రులు, ఎమ్మెల్యేల వరకు అందరిలో కనిపిస్తుంటుంది. అందుకే తెలంగాణకు హైదరాబాద్‌ ఒక్కటే రాజధానిగా ఉన్నప్పటికీ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో సమాంతరంగా అభివృద్ధి చెందుతున్నాయి.

కానీ ఏపీలో ఏమి జరుగుతోందో రాష్ట్ర ప్రజలందరూ కళ్ళారా చూస్తూనే ఉన్నారు. చెవులారా వింటూనే ఉన్నారు. పాలకులు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సి ఉండగా, అభివృద్ధి కోసం ప్రజలే పాలకులతో పోరాడాల్సిన దుస్థితి ఏపీలో నెలకొంది.

అయితే ఆ ప్రజలు కూడా భయపడే పరిస్థితి కూడా నెలకొంది. చంద్రబాబు నాయుడు అరెస్ట్, టిడిపి నేతలందరిపై కేసులు, అరెస్టులు ఇందుకు తాజా నిదర్శనంగా కనిపిస్తున్నాయి.

రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్రాభివృద్ధి గురించి ఆలోచించాల్సిన వైసీపి రాష్ట్రంలో తన అధికారాన్ని కొనసాగించడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుండటం చాలా శోచనీయం.

తెలంగాణ పాలకులు రాష్ట్రాభివృద్ధి, రాష్ట్ర ప్రయోజనాల కోసం నిరంతరం పోరాడుతూ ఒకటొకటిగా అన్నీ సాధించుకొంటుంటే, ఏపీలో పాలకులు ఢిల్లీకి వెళ్ళి కేసులు, అప్పులు, రాజకీయాలు మాట్లాడుకొని ఉపశమనం పొందడమే తప్ప రాష్ట్రం కోసం సాధించి తెచ్చింది ఏమిటి? అని ప్రశ్నిస్తే సమాధానం దొరకదు.

ADVERTISEMENT
Latest Stories