ఇకపై తెలంగాణలో పెద్ద సినిమాలకు టికెట్ ఛార్జీల పెంపు ఉండబోదని ఆ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పేశారు. నిజానికి ఆయన కంటే ఏడాది ముందే పుష్ప-2 సంధ్య థియేటర్ ఘటన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కానీ మళ్లీ టికెట్ ఛార్జీలు పెంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతించడం మొదలుపెట్టింది.
ఏపీలో ఇందుకు ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ తెలంగాణలో ‘అండర్ కరెంట్’లా తెలంగాణ సెంటిమెంట్ కూడా ఉంది కనుక ఆంధ్రా దర్శకనిర్మాతలు, నటీనటులు తీసే సినిమాలకు తెలంగాణ ప్రభుత్వం రాయితీలు ఇవ్వడం అవసరమా? అనే విమర్శలు వినిపిస్తుంటాయి.
ఈ సెంటిమెంట్ సృష్టించిన కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇటువంటి వాదనలు, విమర్శలు వినిపించకపోవడం ఆశ్చర్యకరమే! కానీ ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పుడు వినిపిస్తున్నాయి.
ఆ రాజకీయాలను పక్కనపెడితే, సినిమా టికెట్ ఛార్జీలు పెంపుకి తెలంగాణ ప్రభుత్వం అనుమతించడంలో కొన్ని ఊహించని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక దాని నిర్ణయాన్ని తప్పు పట్టలేము.
నిజానికి ఇది ప్రభుత్వం పెద్ద సినిమాలకు ఇస్తున్న బోనస్ వంటిదే. కనుక ఆ బోనస్ లేకపోతే నష్టమనుకోకూడదు. కనుక ఇప్పుడు భారీ బడ్జెట్, పెద్ద హీరోలతో సినిమాలు తీస్తున్న దర్శక నిర్మాతలు తమ పారితోషికాలు, ఖర్చులు తగ్గించుకొని, అవసరమైతే బడ్జెట్ తగ్గించుకుంటే మరీ మంచిది. బడ్జెట్ కంటే కంటెంట్ ముఖ్యం… అని సినీ పరిశ్రమలో కొమ్ములు తిరిగిన దర్శక నిర్మాతలకు బాగా తెలుసు కూడా.



