ఆంధ్రప్రదేశ్‌లో జగన్ ప్యాలస్ రాజకీయాలు, కూటమి ప్రభుత్వం రాజకీయ జోరు, రాష్ట్రంలో ఆర్ధిక, పారిశ్రామిక, మౌలిక వసతుల అభివృద్ధి, సంక్షేమ పధకాలు అమలు వంటివన్నీ పరిగణనలోకి తీసుకొని చూస్తే, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మళ్ళీ కూటమి భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయి. రాబోయే నాలుగేళ్ళు కూడా అన్నీ ఇలాగే సాగితే జగన్‌కి మరోసారి పరాభవం తప్పకపోవచ్చు.
కానీ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి దయనీయంగా మారినప్పటికీ కాంగ్రెస్ పార్టీతో గట్టిగానే పోరాడుతోంది. రైతులకు యూరియా అందించలేకపోవడం వంటి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను బీఆర్ఎస్ పార్టీ ఎండగడుతూ ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తోంది. కానీ కేసీఆర్ అనారోగ్య సమస్యలతో ఫామ్‌హౌసుకే పరిమితం కావడం, కల్వకుంట్ల కవిత తిరుగుబాటు, కేసులు వంటివి బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందికరంగానే ఉన్నాయి. అయినా గట్టిగా నిలబడుతోంది.
అలాగని కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఏమీ లేదు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో కనిపించే అనైక్యత ఇప్పుడు కనిపించడం లేదు. పార్టీలో, ప్రభుత్వంలో అందరూ సిఎం రేవంత్ రెడ్డికి విధేయంగా ఉంటున్నారు.
పైగా కాంగ్రెస్ పార్టీ చేతిలో బీసీ రిజర్వేషన్స్, కాళేశ్వరం కమీషన్ వంటి అస్త్ర శస్త్రాలు ఉండనే ఉన్నాయి. వాటితో బీఆర్ఎస్ పార్టీని దెబ్బ తీయగలదు.
కనుక తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు దేని సమస్యలు దానికున్నా రెండూ సమ ఉజ్జీలుగా కొనసాగుతున్నాయని చెప్పవచ్చు.
తెలంగాణ బీజేపికి కొత్త అధ్యక్షుడుగా రామచందర్ రావుని నియమించినప్పటికీ ఆయనేమీ పెద్దగా హడావుడి చేయడం లేదు. ఈటల రాజేందర్, రఘునందన్ రావులు అధ్యక్ష పదవి ఆశించి భంగపడటంతో వారి గొంతులు వినిపించడం లేదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడపాదడపా ఏదో మాట్లాడినా దాంతో తెలంగాణలో బీజేపికి ఎటువంటి ప్రయోజనమూ కలుగడం లేదు. తెలంగాణ బీజేపిలో మాజీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి, ఎంపీ బండి సంజయ్ గొంతు ఒక్కటే గట్టిగా వినిపిస్తోంది.
కనుక ప్రస్తుతానికి తెలంగాణలో బీజేపి ‘సైలంట్ మోడ్’లో ఉన్నట్లు భావించవచ్చు. కానీ ఎన్నికలు దగ్గర పడితే బీజేపి ‘చక్రం’ తిప్పకుండా ఉండదు. కానీ ఈసారైన సరిగ్గా తిప్పుతుందో లేదో చూడాలి.
వచ్చే ఎన్నికలలో మళ్ళీ మేమే గెలుస్తామంటూ రేవంత్ రెడ్డి, మంత్రులు చెప్పుకోవడంపై బండి సంజయ్ స్పందిస్తూ, “కాంగ్రెస్ పాలన చాలా అధ్వానంగా ఉంది. అందుకే ప్రజల దృష్టి మళ్ళించేందుకు ఓసారి బీసీ రిజర్వేషన్స్, ఓసారి కాళేశ్వరం కమీషన్, ఓసారి ఓట్ల దొంగతనం అంటూ రోజుకో కొత్త డ్రామా ఆడుతోంది. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే నేను రాజకీయ సన్యాసం చేస్తాను,” అని బండి సంజయ్ అన్నారు.
కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి రాదని చెపుతున్న బండి సంజయ్ పనిలో పనిగా బీఆర్ఎస్ పార్టీ కూడా రాదని చెప్పి ఉంటే ఒకలా ఉండేది. కానీ చెప్పలేదు!
బీఆర్ఎస్ పార్టీని బీజేపిలో విలీనం చేసేయాలనే ఆలోచన ఉందని కల్వకుంట్ల కవిత బయట పెట్టారు. బహుశః అందుకే బండి సంజయ్ ఇదివరకులా బీఆర్ఎస్ పార్టీతో కరుకుగా వ్యవహరించడం మానుకున్నారా?వచ్చే ఎన్నికల నాటికీ బీజేపి-బీఆర్ఎస్ పార్టీల బంధం ఏర్పడబోతోందా?అందుకే కాంగ్రెస్ పార్టీ గెలవదని బండి సంజయ్ ఇంత ఖచ్చితంగా చెపుతున్నారా?అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెపుతుంది.




