తెలంగాణ రాజకీయం: టీడీపీ వదిలినా.? తెలంగాణ వదలదా.?

TDP Internal Criticism

తెలంగాణ గడ్డ మీద పుట్టిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో దాదాపు కనుమరుగయిపోయిందనే చెప్పాలి. తెలంగాణలో టీడీపీ కి ఒక బలమైన క్యాడర్ ఉంది, పార్టీకి సానుభూతిపరులున్నారు, మద్దతుదారులు ఉన్నారు.

కానీ వారందరిని ఒకే తాటిమీదకు తెచ్చి సమర్ధవంతంగా నడిపించగలిగే నాయకుడే తెలంగాణ టీడీపీ కి కరువయ్యారు. ఆ నాయకత్వ లోపమే టి.టీడీపీ కి ఒక శాపంగా మారింది. పార్టీ అధినేతగా చంద్రబాబు పూర్తిగా ఆంధ్రా రాజకీయాలకే పరిమితం అవ్వడం, పార్టీ భవిష్యత్ నాయకుడిగా ఉన్న నారా లోకేష్ కూడా ఏపీ రాజకీయ చట్రంలోనే కూరుకుపోవడంతో టి. టీడీపీ నాయకత్వ లోపంతో అల్లాడుతోంది.

ADVERTISEMENT

ఇలా పార్టీ అధిష్టానమే తెలంగాణ లో తమ రాజకీయాన్ని పూర్తిగా వదులుకుంటున్నా తెలంగాణ అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిఆర్ఎస్, కొత్తగా పుట్టుకొచ్చిన కవిత టిఆర్ఎస్ టీడీపీ ని మాత్రం వదలడం లేదు. కాంగ్రెస్ పార్టీలో సీఎం రేవంత్ టార్గెట్ గా జరుగుతున్న అంతర్ యుద్ధం లో కాంగ్రెస్ లోని అసమ్మతి నేతలు టీడీపీ ప్రస్తావన తెస్తూనే వస్తున్నారు.

రేవంత్ ను టీడీపీ మనిషిగా చిత్రీకరిస్తూ తెలంగాణలో రాజకీయ ఊసే లేని టీడీపీ ఉనికిని వెతుకుతున్నారు. ఇక విపక్ష బిఆర్ఎస్ రాజకీయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెరాస అనే ప్రాంతీయ పార్టీ నుంచి బిఆర్ఎస్ అనే జాతీయ పార్టీగా రూపాంతరం చెందినా బిఆర్ఎస్ ఇప్పటికి తన రాజకీయ ప్రత్యర్థి టీడీపీ నే అనే భావనలో ఉండిపోతుంది.

టీడీపీ కేంద్రంగా రాజకీయ విమర్శలు చేయకుండా బిఆర్ఎస్ తన రాజకీయాన్ని ముందుకు కొనసాగించలేని పరిస్థితి అంటే అతిశయోక్తి కాదేమో. తెలంగాణ కు నీళ్లు, నిధులు రాకపోయినా అందుకు బాబే కారణం, సీఎం రేవంత్ తుమ్మినా, దగ్గినా అది బాబు ఆదేశానుసారమే అంటూ తెలంగాణలో కేసీఆర్ భూస్థాపితం చేసిన టీడీపీ ని తిరిగి అదే పార్టీ నేతలు భుజాన మోస్తున్నారు.

ఇక తెలంగాణలో రాజ్యాధికారమే లక్ష్యం అంటూ తండ్రి కేసీఆర్ ని, అన్న కేటీఆర్ ని కాదనుకుని తెలంగాణ రక్షణ సేన అంటూ టిఆర్ఎస్ తో తెలంగాణలో కొత్త రాజకీయం మొదలుపెట్టిన కవిత సైతం తన తండ్రి పాడిన పాత పాటనే ఆలపిస్తూ టీడీపీ టార్గెట్ గానే ముందుకెళ్తున్నారు.

ఇలా తనకు తానుగా తెలంగాణ రాజకీయాలను వదులుకున్న టీడీపీ ని తెలంగాణ రాజకీయం మాత్రం కాంగ్రెస్, బిఆర్ఎస్, టిఆర్ఎస్ రూపంలో వదల బొమ్మాలి వదలా అంటూ వెంటాడుతున్నాయి. ఇప్పటికి తెలంగాణ రాజకీయాలలో టీడీపీ ప్రస్తావన వస్తుంది అంటే అక్కడి రాజకీయ పార్టీలకు ‘క్షేత్ర స్థాయిలో టీడీపీ బలమేమిటో.? ఆ బలం ఇచ్చే పవర్’ ఏమిటో అన్నది ఎరుకే అన్నమాట…!

ADVERTISEMENT
Latest Stories