రాష్ట్ర విభజన తర్వాత రాజధాని లేకుండా తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో ఇరుకొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు, ఐటి కంపెనీలు, వాణిజ్య సంస్థలు ఏర్పాటు చేస్తారని ఎవరూ ఊహించి ఉండరు. కానీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఉన్న నమ్మకం, ఆయన చొరవతో రాష్ట్రానికి అనేక కంపెనీలు వచ్చాయి. వాటిలో యూఏఈకి చెందిన లులూ గ్రూప్ కూడా ఒకటి.
విశాఖ సముద్రతీరం ఎదురుగా అది రూ. రూ.2,200 కోట్లు పెట్టుబడితో ఓ భారీ షాపింగ్ మాల్ నిర్మించడానికి సిద్దపడింది. టిడిపి ప్రభుత్వం దానికి 13 ఎకరాల స్థలం దీర్గకాలిక లీజుగా ఇచ్చింది. లులూ గ్రూప్ అక్కడ నిర్మాణ పనులు మొదలుపెట్టేందుకు సిద్దమవుతుండగా ఏపీలో ప్రభుత్వం మారి వైసీపీ అధికారంలోకి వచ్చి దానికి రెడ్ సిగ్నల్ చూపి బ్రేకులు వేసింది.
ఆ లీజు ఒప్పందాన్ని అది తిరస్కరించి, ఆ సంస్థకు ఇచ్చిన భూమిని వాపసు తీసుకొంది. దాంతో లులూ గ్రూప్ తమిళనాడుకు వెళ్ళిపోయి అక్కడ కోయంబత్తూరులో రూ. 3,000 కోట్లతో ఇంకా పెద్ద హైపర్ మార్కెట్ నిర్మించి ఇటీవలే ప్రారంభించింది.
ఇప్పుడు ఆ సంస్థ హైదరాబాద్‌లో కూడా మరో హైపర్ మార్కెట్ ఏర్పాటు చేస్తోంది. తెలంగాణ ఐటి, పరిశ్రమల మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటనలో లులూ గ్రూప్‌తో ఒప్పందం చేసుకొన్నారు. దాని ప్రకారం లులూ గ్రూప్ హైదరాబాద్‌లో రూ.3,500 కోట్లు పెట్టుబడి పెట్టబోతోంది.
దానిలో భాగంగా రూ.300 కోట్ల పెట్టుబడితో నిర్మిస్తున్న ఓ భారీ షాపింగ్ షాపింగ్ మాల్‌కి ఈ ఆగస్ట్ లేదా సెప్టెంబర్ నెలల్లో ప్రారంభోత్సవం కానుంది. ఇదిగాక తెలంగాణలో ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలు, వాటి ఎక్స్ పోర్ట్ కంపెనీని కూడా ఏర్పాటు చేస్తోంది. వీటన్నిటి ద్వారా సుమారు 2-3,000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు, పరోక్షంగా అనేక వేలమందికి ఉపాధి లభించనున్నాయి.
జగన్ ప్రభుత్వం వద్దనుకొన్న లులూ గ్రూప్, కేరళ, తమిళనాడు, తెలంగాణ, చివరికి జమ్ము కశ్మీర్ రాష్ట్రం కూడా రెడ్ కార్పెట్ పరిచి స్వాగతం పలకడంతో ఆయా రాష్ట్రాలలో అది భారీ షాపింగ్ మాల్స్ నిర్మిస్తోంది.
ప్రభుత్వ విధానాలు ఏవిదంగా ఉండాలో ఆ రాష్ట్రాలు ఆచరణలో చూపిస్తుంటే ఏవిదంగా ఉండకూడదో జగన్ ప్రభుత్వం చూపిస్తోంది. అయితే జగన్ ప్రభుత్వం ‘ప్రజల ఛాయిస్’ గాబట్టి దానిని తప్పుపట్టలేము. అందుకే మీ నమ్మకం, మీ భవిష్యత్ మా చేతుల్లో అని స్టిక్కర్స్ కూడా అంటిస్తోంది. మరైతే ఏం చేద్దాం?



