రాష్ట్రం ఏదైనా సరే అధికారంలో ఉన్న పార్టీలు మా పాలనలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని చెప్తాయి. దానికి కౌంటర్ గా మునుపెన్నడూ లేనంతగా ప్రస్తుత ప్రభుత్వం అవినీతికి పాల్పడింది, ప్రజాసంక్షేమం గాలికి వదిలేసిందని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తాయి. అధికార ప్రతిపక్షాల మధ్య విమర్శలు ఎలా ఉన్నా.. విస్తుపోయి చోద్యం చూడడం, ప్రేక్షక పాత్ర వహించడం సగటు మానవుడి వంతు అవుతుంది. ఏది వాస్తవమో, ఏది అవాస్తవమో తెలియక అయోమయంలో బ్రతికేయడం ప్రజల వంతు అవుతుంది.
ఈ ప్రస్థావనకు అద్దం పట్టే పరిస్ధితి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో నెలకొంది. సరిగ్గా ఒక్కరోజు క్రితం అధికార బిఆర్ఎస్ పార్టీ 22వ ఆవిర్భావ వేడుకల్లో కేసీఆర్ చాలా అంశాల్లో అవినీతికి పాల్పడుతున్న తన సొంత పార్టీ ఎమ్మెల్యే, యం.పి లకు సావధానంగా చెప్తూనే వీపు విమానం మోత మ్రోగుతుంది అనేలా సరిచినట్లు వార్నింగ్ ఇచ్చారు. దీంతో ప్రజల్లో కూడా కొంతమంది ప్రజా ప్రతినిధుల పట్ల వ్యతిరేకత వ్యక్తం అవుతుంది గాని, కేసీఆర్ పట్ల మాత్రం పాజిటివ్ గా ఉన్నట్లే కనిపిస్తున్న పరిస్థితి.
అయితే తాజాగా ఈరోజు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ ప్రభుత్వం పై చేసిన అవినీతి ఆరోపణలు ఒక్కసారిగా యావత్ తెలంగాణ ప్రజానీకానికి కళ్ళు బయర్లు కమ్మేలా చేస్తుంది. రేవంత్ ఆరోపించినట్లుగా ఇంత స్కామ్ జరిగిందా, తెలంగాణ సంపదను ఇతర రాష్ట్రాలకు దోచిపెడుతున్నారా! ఇదంతా నిజమా.. నిప్పులేకుండా పొగ రాదు కదా అన్నట్లు, ఎంతోకొంత సమాచారం లేకుండా ప్రతిపక్షాలు కూడా ఇంతలా ఎందుకు అవినీతి ఆరోపణలు చేసే సాహసం చేస్తాయి అనే చర్చ ప్రస్తుతం తెలంగాణలో జరుగుతుంది.
ఇక వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) లీజు అంశంలో అతిపెద్ద స్కాం జరిగిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. దాదాపు 1000 కోట్లు చేతులు మారాయని ఆయన అన్నారు. 30వేల కోట్ల ఆదాయం వచ్చే ఓఆర్ఆర్ ను కేవలం 7380 కోట్లకే కట్టబెట్టారని రేవంత్ ఆరోపించారు. ప్రతి ఏటా ఓఆర్ఆర్ ఆదాయం 10 శాతం పెరుగుతుందని, అంటే కనీసం 30 వేల కోట్ల ఆదాయం వచ్చే ఓఆర్ఆర్ ని అంత చౌకగా ఎలా లీజుకు ఇస్తారని రేవంత్ విమర్శించారు. ఈ అంశంపై సిబిఐ, ఈడీ, విజిలెన్స్ దర్యాప్తు సంస్థలు విచారణ జరగాలని రేవంత్ అన్నారు.
రేవంత్ రెడ్డి శనివారం గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతూ ఓఆర్ఆర్ లీజు వ్యవహారంలో జరిగిన అవినీతి గురించి ప్రస్తావిస్తూ.. ఓఆర్ఆర్ పై వచ్చే ఆదాయం ముంబై కంపెనీకి తాకట్టు పెట్టారని, మొదట్లో లీజు ద్వారా 10 వేల కోట్ల ఆదాయం వస్తుండేదని, తర్వాత 8 నుండి 9 వేల కోట్లు వచ్చేదని, ప్రస్తుతం 7380 కోట్లు మాత్రమే వచ్చాయని, ఈ వ్యవహారంలో దాగి ఉన్న మతలబు ఏమిటని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
ఓఆర్ఆర్ లీజుకు సంబంధించిన వ్యవహారం మొత్తం సోమేశ్ కుమార్ కనుసన్నుల్లో జరిగిందని, సోమేషకుమార్ సూచనతోనే అరవింద్ కుమార్ సంతకం చేశారని రేవంత్ ఆరోపించారు. ప్రభుత్వం దిగిపోయే ఆరు నెలల ముందు తీసుకున్న ప్రతీ నిర్ణయాన్ని వచ్చే ప్రభుత్వం పునః సమీక్షిస్తుంది రేవంత్ అన్నారు. కేటీఆర్, సోమేశ్ కుమార్, అరవింద్ కుమార్ ఈ వ్యవహారంలో దోపీడికి పాల్పడుతున్నారని, ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించదని రేవంత్ పేర్కొన్నారు. ఈ అంశాన్ని లోతుగా పరిశీలిస్తున్నామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మొట్టమొదటగా వీటిపైనే విచారణ జరిపిస్తామన్నారు.
ఈ అంశంలో యాజమాన్యం కూడా జైలుకు వెళ్లాల్సి వస్తుందని రేవంత్ హెచ్చరించారు.
సోమేశ్ కుమార్, అరవింద్ కుమార్, జయేష్ రంజన్ ల నిర్ణయాలన్నింటిని కాంగ్రెస్ పార్టీ సమీక్షిస్తుందని, 2018 నుంచి ఓఆర్ఆర్ టోల్ ను ఏయే సంస్థలు వసూలు చేశాయో, ఆ సంస్థలకు టెండర్లు ఏ రూపంలో కట్టబెట్టారో అనే విషయాన్ని స్పష్టం చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
గత నాలుగు సంవత్సరాల నుంచి ఓఆర్ఆర్ టోల్ ను ఈగల్ ఇన్ఫ్రాకు కట్టబెట్టారని, ఓఆర్ఆర్ ద్వారా రోజుకు కనీసం 2 కోట్ల మేర టోల్ వసూలు అవుతుందని రేవంత్ తెలిపారు. టెండర్ అవసరం లేకుండానే ఏడాదికి ఏడాది పొడిగించుకుంటూ కేటీఆర్ ఇందులో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని, ఔటర్ రింగ్ రోడ్ ను ఆదాయ వనరుగా మార్చుకుని కేటీఆర్ మరియు ఆయన మిత్రబృందం ఉపయోగించుకుందని రేవంత్ విమర్శించారు. ఇందుకు మాజీ సీఎస్ సోమేశ్ కుమార్, హెచ్ఎండీఏ కమిషనర్ అరవింద్ కుమార్, జయేష్ రంజన్ లు సహకరించారని రేవంత్ ఆరోపించారు. ఈ ఆదాయాన్ని శాశ్వతంగా ఉపయోగించుకునే ఆలోచనతోనే కేటిఆర్ కుటుంబం ఇలా చేసిందని రేవంత్ అన్నారు.
తమ కుటుంబానికి లాభం ఉండదని గ్రహించి టోల్ ఆపరేట్ ట్రాన్స్‌ఫర్ (TOT) విధానంలో 30 ఏళ్ళు ప్రయివేటు సంస్థకు కట్టబెట్టాలని నిర్ణయం తీసుకున్నారని, అందుకే ఔటర్ రింగ్ రోడ్డును కేటీఆర్ ప్రయివేటు వారికి తాకట్టు పెట్టారని, ఒక రకంగా చెప్పాలంటే వేల కోట్ల ఆదాయం వచ్చే రింగ్ రోడ్ ను ప్రయివేటు సంస్థలకు అమ్మేశారని రేవంత్ ప్రభుత్వ తీరును తప్పుపట్టారు.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఇటువంటి నిర్ణయాలపై బీజేపీ ఎందుకు పెదవి విప్పడం లేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ప్రజల ఆస్తులు కేసీఆర్ అమ్ముతుంటే బండి సంజయ్, కిషన్ రెడ్డి లు చోద్యం చూస్తున్నారని, ఈ అంశంపై బీజేపీ నేతలు కూడా స్పందించాలని రేవంత్ డిమాండ్ చేశారు.
2004 లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించారని, హైదరాబాద్ మహా నగరానికి మణిహారంగా ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం జరిగిందని, అందుకోసం రూ. 6696 కోట్లు గత రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిందని రేవంత్ అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఔటర్ రింగ్ రోడ్డును కాంగ్రెస్ నిర్మించిందని, తెలంగాణకు పెట్టుబడులు పెడుతున్నారంటే దానికి కారణం విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్ లే ప్రామాణికం అని రేవంత్ వ్యాఖ్యానించారు.
హైదరాబాద్ కు వచ్చే ప్రతి వాహనం ఓఆర్ఆర్ ను టచ్ చేయాల్సిందేనని, ఓఆర్ఆర్ ను లీజుకు ఇవ్వాలన్న నిర్ణయంతో ప్రజలు ఔటర్ రింగ్ రోడ్ ను వినియోగించుకోలేని పరిస్థితులు దాపురించాయని రేవంత్ అవేదన వ్యక్తం చేశారు. ఎందుకంటే టోల్ ఛార్జీలు పెంచుకునే వెసులుబాటుకు కూడా టోల్ సంస్థకు కట్టబెట్టారని రేవంత్ అన్నారు. పెట్టుబడులు అంటే నూతన ఇన్ఫ్రా స్ట్రక్చర్ ఏర్పాటు చేయాలి కానీ ఉన్నవాటిని ఆమ్మేసి దాన్ని పెట్టుబడిగా చూపిస్తూ ప్రభుత్వం పెద్దఎత్తున ప్రచారానికి దిగుతోందని ఆయన ప్రభుత్వ తీరును విమర్శించారు.
టెండర్ విధానాలపై ఈడీ, సీబీఐ, సెంట్రల్ విజిలెన్స్ సహా విచారణ సంస్థలన్నింటికి పిర్యాదు చేస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. వాస్తవంగా ఇంతకు ముందు దీన్ని అదానికి కట్టబెట్టాలని చూశారని, ఆరోపణల నేపథ్యంలో ముంబై కంపెనీకి తాకట్టు పెట్టారని రేవంత్ ఆరోపించారు. 2018 నుంచి ఎవరికి టోల్ వసూలు బాధ్యతలు ఇచ్చారో హెచ్ఎండీఏ అధికారులు బయట పెట్టాలని రేవంత్ డిమాండ్ చేశారు. ప్రజలకు అవసరమయ్యే ఔటర్ రింగ్ రోడ్ ను ఇప్పుడు అమ్మాల్సిన అవసరం ఏం వచ్చిందని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.



