ఇటీవల కాలంలో డబ్బింగ్ బొమ్మలకు తెలుగు ప్రేక్షకుల ఆదరణ చాలా తగ్గిపోయిందని చెప్పవచ్చు. ముఖ్యంగా కొత్తదనం లేని సినిమాల వైపుకు టాలీవుడ్ ఆడియన్స్ అస్సలు చూడడం లేదని తాజాగా ‘అజ్ఞాతవాసి’ కూడా నిరూపించింది. ఇదే సమయంలో నూతన కధలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే సినిమాలకు పట్టం కట్టడంలో వెనుకడుగు వేయబోమని ‘అర్జున్ రెడ్డి’ వంటి సినిమాల ద్వారా నిరూపణ అయ్యింది. తాజాగా ఈ రెండింటి కలయికతో “టిక్ టిక్ టిక్” అనే డబ్బింగ్ బొమ్మ ఈ నెల 26వ తేదీన తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతోంది.
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తెలుగు టీజర్ ను విడుదల చేయగా, సరికొత్తగా ఈ సినిమా రూపుదిద్దుకుందని టీజర్ స్పష్టం చేసింది. హాలీవుడ్ సినిమాల రేంజ్ లో ఈ “టిక్ టిక్ టిక్” బొమ్మ కనపడుతోంది. జయం రవి హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ‘మెంటల్ మదిలో’ ఫేం నివేతా పెతురాజ్ హీరోయిన్ గా నటిస్తోంది. కధతో పాటు అత్యున్నత సాంకేతిక విభాగం కూడా ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ లో ఉందని, టీజర్ ప్రోమో స్పష్టం చేసింది. ‘బిచ్చగాడు’ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించిన ప్రొడక్షన్ సంస్థే ఈ సినిమాను కూడా టాలీవుడ్ ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తోంది.



