తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామి విషయంలో తెలియకుండా చిన్న తప్పు జరిగినా భక్తులు క్షమాపణలు కోరుకుంటారు. పొర్లుదండాలు పెడతారు. ఉపవాసాలు, దీక్షలు చేస్తారు. అలాంటి పవిత్ర స్థలంలో నెయ్యిలో రసాయనాలు కలిపి, పరీక్షల్లో కల్తీ అని తేలిన తర్వాత కూడా అదే నెయ్యిని వినియోగించడం సరైనదేనా? అనే ప్రశ్న భక్తులను కలవరపెడుతోంది.
“జంతు కొవ్వు లేదు, కేవలం రసాయనాలే కలిపాం” అన్న వాదన భక్తులకు సమాధానం ఇవ్వడం లేదు. నెయ్యి కాకుండా నెయ్యిలా కనిపించే పదార్థాన్ని దేవదేవుడి సేవలో వినియోగించడం తప్పు కాదా? ఇది అపచారం కాదా? అనే సందేహాలు బలంగా వినిపిస్తున్నాయి.
మన పిల్లలకు ఇచ్చే పాలు కల్తీ అని తేలితే డిపోను నిలదీస్తాం. అలాంటప్పుడు, శ్రీవారి సేవలో ఉపయోగించే నెయ్యి కల్తీ అయితే ఎలా ఊరుకుంటాం? కల్తీపై సాక్ష్యాలు ఉన్నాయన్న ఆరోపణలున్నా, తప్పే జరగలేదని చెప్పడం భక్తుల్లో ఆగ్రహాన్ని పెంచుతోంది.
ఈ అంశంపై తితిదే పూర్వ ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యం తీవ్రంగా స్పందించారు. “రసాయనాలు కలిపిన నెయ్యిలాంటి పదార్థాన్ని తిరుమలలో వినియోగించడం మహాపచారం. వాదనలు మానేసి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి” అని ఆయన డిమాండ్ చేశారు. తప్పు జరిగిందా లేదా అన్నది స్పష్టంగా చెప్పాలని అన్నారు.
ఇది రాజకీయ అంశం కాదని, భక్తుల విశ్వాసానికి సంబంధించిన విషయమని పలువురు చెబుతున్నారు. తప్పు జరిగితే బాధ్యులు ముందుకు వచ్చి అంగీకరించాలి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా నెయ్యి సరఫరాకు పకడ్బందీ వ్యవస్థ తీసుకురావాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది.






