తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ రాజకీయ పార్టీని రిజిస్టర్ చేయడానికి సన్నద్ధం అవుతున్నారు. ఈ నెలాఖరులో ఒక బృందం డిల్లీ వెళ్లనుంది. పార్టీకి తెలంగాణ జన సమితి (టీజేఎస్) అనే పేరును పెట్టాలనుకున్నా, వేరే ఎవరో ఆ పేరు మీద రిజిస్టర్ చేయడంతో దానిని సాధించేందుకు సమాలోచనలు జరుపుతున్నారు.
తెలంగాణ జేఏసీ పేరుకు సామీప్యత ఉండేవిధంగా, అన్ని వర్గాలకు ఆమోదయోగ్యంగా ఉండే పేరుకోసం తర్జనభర్జన పడుతున్నారట. భవిష్యత్తులో తలపోటు అయ్యే అవకాశం ఉండటంతో ఇప్పటికే కోదండరామ్ పై విమర్శలు చేస్తున్నారు తెరాస వారు. స్వయంగా కేసీఆరే ఆయనను విమర్శిస్తున్నారు కూడా.
కోదండరామ్ కాంగ్రెస్ తొత్తు అని ఆరోపిస్తున్నారు కూడా. అయితే కోదండరామ్ పార్టీ ప్రకటించగానే రాష్ట్రరాజకీయాల్లో పెనుమార్పులు రావడం ఖాయం అని విశ్లేషకుల అంచనా. తెలంగాణ సాధనకొరకు కేసీఆర్ తో సమానంగానో అంతకంటే ఎక్కువగానో పని చేసారని ఆయనకు పేరు ఉంది. దీనితో ఆయనను రాజకీయాలలో ఏమేరకు ప్రజలు ఆదరిస్తారో చూడాలి.



