సిట్ విచారణ అత్యంత రహస్యంగా జరుగుతోందని చెప్తున్న అధికారుల మాటల్లో నిజం లేదని, ఒకవేళ అలాగే జరిగితే లోన విచారణలో ఏం జరుగుతుందో మీడియాలో ఎలా వస్తున్నాయని, అలా రావడంతో ప్రజలు వాటినే నమ్మి నిజమనుకునే ప్రమాదం ఉందని, ఇది ఆయా సెలబ్రిటీల కుటుంబాల పరువు ప్రతిష్టలకు సంబంధించిన అంశమని వర్మ చేసిన వ్యాఖ్యలకు ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ అకున్ సబర్వాల్ విలువనిస్తూ… ఓ ఇద్దరు అధికారులను సిట్ విచారణకు సంబంధించి అఫిషియల్ స్పోక్స్ మెన్ గా నియమించారు.
అయితే సదరు అధికారులు ఇంకా పెదవి విప్పకముందే హీరో నవదీప్ కు సంబంధించిన విచారణ మళ్ళీ మీడియాలో ప్రసారమవుతోంది. అలాగే కేసీఆర్ మానస పుత్రికగా పేర్కొనే ‘నమస్తే తెలంగాణా’ దినపత్రికలో అయితే ఏకంగా నవదీప్ తన తప్పును ఒప్పుకున్నారని, పూర్తి సమాచారాన్ని సిట్ అధికారుల ముందుంచారని ప్రచురించింది. పలువురు హీరోలు, హీరోయిన్లు కూడా డ్రగ్స్ వాడుతున్నట్లుగా నవదీప్ చెప్పినట్లుగా సంచలన విషయాన్ని తెలిపింది.
అమెరికా, బ్రెజిల్, థాయిలాండ్, బెల్జియం వంటి దేశాలతో పాటు గోవా, ముంబై, కోల్ కతా, కోడైకెనాల్, ఊటీ వంటి ప్రముఖ నగరాలలో భారీ ఈవెంట్లను నిర్వహించిన మాట వాస్తవమేనని, సదరు ఈవెంట్లకు హాజరైన ప్రముఖులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తూ… వారి అభిమతానికి అనుగుణంగా మాదకద్రవ్యాలను అందజేసినట్లుగా నవదీప్ తెలిపారనేది సదరు పత్రిక కధనంలోని ప్రధాన అంశాలు. అలాగే తన బ్లడ్ శాంపిల్స్, తల వెంట్రుకలు, కాలి గోళ్ళు ఇవ్వడానికి నవదీప్ నిరాకరించడంతో విచారణకు శుభంకార్డు పడింది. గత రెండు రోజులుగా ఇంత రచ్చ జరిగినా… మీడియాలో ఈ లీకులను అరికట్టడంలో విఫలమవుతున్నారనేది ఈ సందర్భంగా తేలిన అంశం.


