టికెట్ల పంచాయితీ: తెగేదెప్పుడు.?

Tollywood ticket rate controversy creates political and industry tension in Andhra Pradesh and Telangana

సినీ పరిశ్రమకు ఒక కొరకరాని కొయ్యగా మారింది ఈ టికెట్ రేట్ల పంచాయితీ. ఈ పంచాయితీ పై ఇండస్ట్రీ పెద్దలలోనే ఏకాభిప్రాయం లేదనేది సర్వత్రా వినిపిస్తున్న ఒక వాదన.

ఒకరు టిక్కెట్ రేట్ల పెంపుతో సినిమాను బతికించుకోవాలి అంటూ వాదిస్తుంటే, ఈ టిక్కెట్ రేట్ల పెంపు సినిమాని చంపేస్తుంది అంటూ మరొకరు అభిప్రాయ పడుతున్నారు.

ADVERTISEMENT

ఇంకొంతమంది సినిమా టిక్కెట్ రేట్ల కంటే ధియేటర్లలో పాప్ కార్న్ రేట్లు ఎక్కువగా ఉన్నాయని, వాటి పై ప్రభుత్వానికి లేని నియంత్రణ టిక్కెట్ రేట్ల పై అవసరమా.? అంటూ నిట్టూరుస్తున్నారు.

వైసీపీ ప్రభుత్వ హయాంలో మొదలైన ఈ టిక్కెట్ రేట్ల పెంపు పంచాయితీ ఇప్పటికి పరిష్కారం నోచుకోక అటు సినీ ఇండస్ట్రీని ఇటు రెండు రాష్ట్ర ప్రభుత్వాలను వెంటాడుతుంది.

అయితే ఇక్కడ ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో, రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి గా జనసేన ఎమ్మెల్యే కందుల దుర్గేష్ ఉండడంతో ఇండస్ట్రీకి సానుకూల వాతావరణం నెలకొన్నప్పటికీ, అక్కడ మాత్రం ఇక నుండి తెలంగాణలో టికెట్ రేట్లు పెంచేది లేదని అఖండ – 2 రీలిజ్ తరువాత ఆ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే ప్రకటించేసారు.

ఈ నేపథ్యంలో ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రానున్న ప్రభాస్ రాజాసాబ్, మెగాస్టార్ మన శంకర వరప్రసాద్, రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి వంటి స్టార్ హీరోల సినిమాలకు తెలంగాణలో టిక్కెట్ రేట్ల పెంపు ఉంటుందా.? మళ్ళీ రేవంత్ సర్కార్ దగ్గర సినీ పరిశ్రమ ఈ పెంపు కోసం పంచాయితీ పెడుతుందా అనేది అందరికి ఆసక్తిగా మారింది.

ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం తాము ఇచ్చిన ప్రకటనకే కట్టుబడి సినిమా టిక్కెట్ రేట్లు పెంచేది లేదు అంటూ తెగేసి చెపితే ఆ ప్రభావం అటు ఏపీలో కూటమి ప్రభుత్వం మీద కూడా పడుతుంది. పొరుగు రాష్ట్రంలో ఆ ధర ఇక్కడ ఇంత రేటా అంటూ అటు ప్రత్యర్థి వైసీపీ తో పాటుగా సామాన్య ప్రేక్షకుడు సైతం ఏపీ ప్రభుత్వ తీరుని తప్పుబట్టే అవకాశం ఉంది.

అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం సామాన్య ప్రేక్షకుడిని దృష్టిలో పెట్టుకుని మూవీ టిక్కెట్ రేట్లను నిర్ణయించిందని, కానీ కూటమి సెలబ్రెటీల పక్షాన నిలబడింది అనే వాదన తెరమీదకు వచ్చే ప్రమాదం లేకపోలేదు. దానికి తోడు హీరో హెవీ రెమ్యూనరేషన్ల అంశం కూడా తిరిగి చర్చలోకి వస్తుంది, ఈ అంశం ఈ సమస్య పై మేజర్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది కూడా.

ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం కూడా ఏపీ మాదిరి టికెట్ రేట్ల పెంపుకి అనుమతిస్తే అప్పుడు మంత్రి ఇచ్చిన ప్రకటనకు ప్రభుత్వం కట్టుబడలేకపోతుందా.? ఇండస్ట్రీ ప్రముఖుల ఒత్తిడికి రేవంత్ సర్కార్ తలవంచిందా అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అనేక విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది, అలాగే నిందలు మోయాల్సి ఉంటుంది.

ఈ సమస్య పై రెండు రాష్ట్ర ప్రభుత్వాల పరిస్థితి ఇలా ఉంటె అసలు సమస్య పరిష్కారం కోసం టాలీవుడ్ ఎం చేస్తుంది.? ఎటువంటి ప్రతిపాదనలతో ప్రభుత్వాల ముందుకు రానుంది.? సామాన్యుడి నుండి రాజకీయ ప్రముఖుల వరకు ఇండస్ట్రీ ప్రముఖుల రెమ్యూనరేషన్ పై చేస్తున్న ఆరోపణలకు ఎటువంటి సమాధానాలను సిద్ధం చేస్తుంది.?

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇలా సినిమా రిలీజ్ ల ముందు ప్రభుత్వాలతో రేట్ల పంచాయితీ ఎందుకు.? ఇలా ప్రతిసారి ప్రభుత్వాల చుట్టూ అర్జీలు పెట్టుకుంటూ ప్రభుత్వ జీవో ల కోసం పడుగాపులెందుకు.?

ఇండస్ట్రీ పెద్దలు మొత్తం కూర్చుని అసలు ఏ సినిమాకి ఎంత రేటు ఉండాలి.? ఏది చిన్న సినిమా.? ఏది పెద్ద సినిమా.? దేనికి ఎంత టిక్కెట్ ఉంటే ఇండస్ట్రీకి మంచి జరుగుతుంది అన్న విషయాల పై చర్చించుకుని ఇండస్ట్రీ నుంచి ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన ఇవ్వండి, దాని బట్టి ప్రభుత్వం తన నిర్ణయాన్ని ప్రకటింస్తుంది అంటూ ఇండస్ట్రీ ప్రముఖులకు ఒక సూచన చేసారు.

అయితే ఆ సూచన ఇప్పటికి కార్యరూపం దాల్చలేదు. అంటే నిర్లక్ష్యం టాలీవుడ్ దే అనాలా.? సమస్య శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధం అంటూ పవన్ ప్రకటించినా ఇండస్ట్రీ నుంచి కనీస స్పందన రాకపోవడం అంటే అసలు సమస్య పరిష్కారం కోసం సినీ పరిశ్రమ ప్రయత్నించడం లేదా.? లేక సమస్య పరిష్కారం మీద వారికే ఒక క్లారిటీ లేదా.?

లేదా సినీ ఇండస్ట్రీలో పైకి కనిపించే కౌగిలింతలు, ఆప్యాతలు అన్ని మేడిపండు మాదిరేనా.? అసలు ఈ సమస్య పై టాలీవుడ్ కంటూ ఒక ఉమ్మడి ప్రణాళిక లేదా.? ఇలా అయితే ఇక ఈ టిక్కెట్ రేట్ల పంచాయితీ అనేది రాజకీయ నాయకుల కేసుల మాదిరే కాలాలు గడవాల్సిందే కానీ సమస్యకు కళ్లెం పడదు.

ADVERTISEMENT
Latest Stories