Tollywood Young Heroesఇది పోటీ ప్రపంచం. ఒకపక్క స్టార్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న కుటుంబాల నుంచి గంపగుత్తగా హీరోలు వస్తున్నప్పుడు సామాన్యులు నెగ్గుకురావడం అంత సులభం కాదు. ఒకప్పుడంటే రవితేజ, నాని లాంటి వాళ్ళు ఏళ్లకేళ్లు ఓపిగ్గా కష్టపడ్డారంటే అప్పటి పరిస్థితులు వేరు ఇప్పటి వాతావరణం వేరు. వేగంగా పరిగెత్తకపోతే కింద పడిపోతాం. పోనీ చేయినిచ్చే వాళ్ళు చుట్టూ ఉన్నారనుకుంటే అది తాత్కాలికమే. సక్సెస్ ఉన్నంత వరకు అలాంటి హస్తాలు వెంట ఉంటాయి. ముఖ్యంగా వయసులో ఉన్న యూత్ హీరోలు ప్లానింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండటం అవసరమే. కానీ అది మరీ మితిమీరిన మోతాదులో ఉంటే చిక్కులు తప్పవు. స్పీడ్ కావాల్సొస్తే గేరు మార్చడమే.

నవీన్ పోలిశెట్టి జాతిరత్నాలు వచ్చి ఇంకో మూడు నెలలు ఆగితే రెండేళ్లు అవుతుంది. ఇప్పటిదాకా తన కొత్త సినిమా మొదలుకాలేదు. అది బ్లాక్ బస్టర్ అవ్వడం వల్ల తొందరపడకపోవడం మంచిదే. అలా అని కనీసం ఏడాదికి ఒకటి రిలీజయ్యేలా చూసుకోకపోతే ఎలా. జాతరత్నాలులో నవీన్ పెర్ఫార్మన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రత్యేకమైన టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. అలా అని అందులో అనుదీప్ పండించిన పంచుల వల్ల పేలిన కామెడీ పాత్రను తక్కువ చేయకూడదు. అవి రెండు సరిగ్గా కుదరడం వల్ల హిట్ అయ్యింది కానీ కేవలం నవీన్ వల్ల కాదు. అంతకు ముందు ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. ఇప్పుడు నిర్మాణ దశలో రెండున్నాయి కానీ వాటిలో ఒకటైనా ముందు వచ్చి ఉంటే బాగుండేది.

Also Read – పుష్ప; తగ్గుతుందా,తగ్గిస్తున్నారా..?

ఇతను ఇండస్ట్రీ వచ్చి పదేళ్లు అవుతోంది. కెరీర్ ఇంకా చాలా ఉంది. అలా అని నిదానమే ప్రధానం సూత్రం అన్నివేళలా పని చేయదు. సిద్దు జొన్నలగడ్డది మరో కథ. డీజే టిల్లుకి ఫిబ్రవరిలో ఫస్ట్ యానివర్సరీ. సీక్వెల్ కి బోలెడు అడ్డంకులు వచ్చేశాయి. ముందు దర్శకుడు మారాడు. ఆ తర్వాత ముగ్గురు హీరోయిన్లు ఒకరి తర్వాత మరొకరు వరసగా తప్పుకున్నారు. ఇంతకీ ఫైనల్ గా ఎవరిని లాక్ చేశారో ఇప్పటికీ అంతు చిక్కడం లేదు. 2009లో పరిశ్రమకు వచ్చిన సిద్దుకు చాలా ఆలస్యంగా బ్రేక్ దక్కింది రైటే. స్వతహాగా రచయిత కాబట్టి కథలను జడ్జ్ చేయడంలో నేర్పరితనం దూకుడు చూపిస్తే కౌంట్ క్వాలిటీ రెండూ బాలన్స్ అవుతాయి కదా.

తొందరపడి చేస్తే కిరణ్ అబ్బవరం లాగా అసలుకే మోసం రావొచ్చనే వెర్షన్ ని కాదనలేం కానీ అతను మాస్ ట్రాప్ లో పడి స్వయంకృతాపరాధం వల్ల చేసిన పొరపాట్లే తప్ప కమర్షియల్ హీరో అయిపోవాలనే ఆత్రం లేకపోతే ఇన్ని దెబ్బలు పడేవి కాదు. వీళ్ళే కాదు నిఖిల్ సైతం రెండేళ్లకొకటి చేస్తున్నాడు. అది కార్తికేయ 2 రూపంలో మంచి ఫలితాన్నే ఇచ్చినా ప్రతిసారి అలాంటి విజువల్ గ్రాండియర్లే దొరకవుగా. 18 పేజెస్ సంగతి తెలిసిందే. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లు ఇలా చేయడంలో అర్థం పరమార్థం ఏమిటో కానీ అప్ కమింగ్ స్టార్లు సైతం ఇదే దారి పట్టడం సరికాదు. ఏడాదికి వచ్చేది యాభై నాలుగు శుక్రవారాలే. వాటిని సరిగ్గా వాడుకోవాలిగా.

Also Read – వినుకొండకు జగన్‌: ఓదార్పుకా… శవ రాజకీయాలకా?