కొన్ని కాంబినేషన్లు చాలా క్రేజీగా ఉంటాయి. ఎన్నిసార్లు రిపీట్ చేసినా వాటికి తిరుగుండదు. ఒకప్పుడు ఎన్టీఆర్-రాఘవేంద్రరావు కలయిక బాక్సాఫీస్ ని ఇలాగే ఊపేసింది. ఇప్పటి పరిస్థితుల్లో ఇలాంటి కాంబోలు మళ్ళీ మళ్ళీ జరగడం అరుదు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ లు ముచ్చటగా నాలుగోసారి జట్టు కట్టబోతున్నారు.
ఒక ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టవచ్చని అల వైకుంఠపురములోతో నిరూపించాక ఈ జోడి మీద ప్రత్యేక అంచనాలు నెలకొంటూ వచ్చాయి. ఒకరకంగా చెప్పాలంటే బన్నీకి అసలు ఫెయిల్యూర్ ఇవ్వని డైరెక్టర్లలో త్రివిక్రమ్ దే మొదటి స్థానం. జులాయి బ్లాక్ బస్టర్ కొట్టింది. సన్ అఫ్ సత్యమూర్తి ఎమోషన్లు సెంటిమెంట్లు కాసింత ఎక్కువే ఉన్నా ప్రేక్షకులు సూపర్ హిట్ చేశారు.
కానీ ఆ టైంకి ఇప్పటికి చాలా మార్పులు వచ్చాయి. పుష్ప పుణ్యమాని బన్నీ రేంజ్ ప్యాన్ ఇండియా స్థాయికి పాకిపోయింది. నార్త్ ఆడియన్స్ తనని బాగా రిసీవ్ చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాలు, కేరళ కాకుండా బయట తనకో మార్కెట్ సంపాదించుకునే స్టేచర్ ఉందని బన్నీకి స్పష్టంగా అర్థమైపోయింది. ఎంత సక్సెస్ ఫ్లోలో ఉన్నా త్రివిక్రమ్ కూడా ప్యాన్ ఇండియా గుర్తింపు కోసం ఎదురు చూస్తున్నారు.
రాజమౌళి లాగా తనకింకా నేషన్ వైడ్ ఇమేజ్ బలపడలేదని తెలుసు. ఓవర్ సీస్ లో మాటల మాంత్రికుడి బ్రాండ్ కి తిరుగులేకపోయినా ఉత్తరాది ప్రేక్షకులకు దగ్గరైతే రేంజ్ పెరిగి బాలీవుడ్ బడా సంస్థలు వెంట పడతాయి. కంటెంట్ కరెక్ట్ గా కుదిరి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ దక్కిందా జక్కన్న లాగా ఇంటర్నేషనల్ ఫిలిం మేకర్స్ దృష్టిలో పడొచ్చు.
అల్లు అర్జున్ హీరోగా అయితే ఈ పని ఇంకాస్త సులభంగా జరుపుకోవచ్చు. కాకపోతే చెప్పుకున్నంత సులభంగా ఈ ఛాలెంజ్ ఉండదు. ఎందుకంటే ఫ్యామిలీ పల్స్ మీద పట్టున్న త్రివిక్రమ్ ఇప్పటిదాకా కంప్లీట్ కమర్షియల్ మసాలా తీయలేదు. మాస్ అంశాలను తన సినిమాల్లో ఒక భాగంగా జొప్పించారు తప్పించి సుకుమార్, రాజమౌళి లాగా హీరోయిజం ఎలివేషన్లతో కథనాన్ని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లడం ఉండదు.
మరి బన్నీతో ప్యాన్ ఇండియా అంటే ఒక సవాల్ లాంటిదే. త్రివిక్రమ్ సెల్ఫ్ గా మేకోవర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎంచుకునే కథలో బ్యాక్ డ్రాప్ తో మొదలుపెట్టి ఆడియన్స్ కి సినిమాలో యునివర్సల్ అప్పీల్ ఉందనిపించేలా ఎన్నో సవాళ్లు ఎదురుకోవాల్సి ఉంటుంది. ఇదీ మంచిదే. కొత్త త్రివిక్రమ్ అని చూడొచ్చు. ప్యాన్ ఇండియా డైరెక్టర్లలో ఆయన పేరుని చేర్చుకోవచ్చు.



