తెలంగాణాలో టీడీపీని ఖాళి చెయ్యాలని కంకణం కట్టుకున్న కేసీఆర్ గత శాసనసభలో ఆ పనిని అసంపూర్తిగా వదిలేశారు. టీడీపీకి ఇద్దరు ఎమ్మెల్యేలు మిగిలారు. సండ్ర వెంకటవీరయ్య పార్టీని వదలకుండా ఉన్నారు, మరో ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య పార్టీకి దూరంగా ఉన్నా టెక్నికల్ గా టీడీపీగానే ఉన్నారు. సండ్ర మళ్ళీ టీడీపీ టిక్కెట్టు తెచ్చుకుని గెలిచారు. టీడీపీ తరపున అశ్వారావుపేట నుండి మెచ్చ నాగేశ్వరరావు కూడా ఎన్నికయ్యారు. వీరిద్దరూ ఇటీవలే అమరావతి వెళ్ళి చంద్రబాబు నాయుడును కలిసి వచ్చారు.
[m9ad]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సండ్ర ను టిటిడి సభ్యుడిగా కూడా నియమించారు. గతంలోనే సండ్ర టీటీడీ బోర్డు మెంబర్ గా ఉన్నారు. అయితే తెలంగాణ ఎన్నికలలో పోటీ చెయ్యడానికి ఎన్నికల కమిషన్ రూల్స్ ప్రకారం రాజీనామా చేశారు. దీనితో ఆయనను మళ్ళీ బోర్డు లోకి తీసుకున్నారు. అయితే ఈసారి ఎలాగైనా టీడీపీని ఖాళీ చెయ్యాలని తెలంగాణ ముఖ్యమంత్రి కంకణం కట్టుకున్నారట. ఇప్పటికే ఒక తెరాస రాజ్యసభ సభ్యుడిని వారితో మాట్లాడాల్సిందిగా పంపారట. తనను సండ్రను పిలిచి దీనిపై మాట్లాడారని, అయితే తాను టిడిపి ని వీడడం లేదని నాగేశ్వరరావు చెప్పారు. పార్టీ మారుతున్నట్లు వస్తున్న ప్రచారం వదంతేనని సండ్ర కూడా కొట్టేశారు.
అయితే వీరి ఖండనలు ఎలా ఉన్నా ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండగలారా అనేది చూడాలి. అది కూడా తెలంగాణాలో భవిష్యత్తు కనిపించని పార్టీలో. పైగా కేసీఆర్ ఆపరేషన్ ఆకర్షను తట్టుకుని. నిజంగా ఉంటే గొప్పే. మరోవైపు కాంగ్రెస్ కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలతో తెరాస మంతనాలు జరుపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే ఇటీవలే ఎన్నికైన ఎమ్మెల్యేలు ఇప్పటివరకు ప్రమాణస్వీకారం చెయ్యలేదు. ప్రమాణస్వీకారం కూడా చెయ్యకముందే భేరసారాలు జరిగిపోతున్నాయి.



