తెలుగుదేశం పార్టీ నుండి టీఆర్ఎస్ పార్టీలోకి జంప్ అయిన 10 మంది ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ సభ్యులుగా గుర్తించాలని ఎర్రబెల్లి దయాకరరావు తెలంగాణా స్పీకర్ కు ఇచ్చిన లేఖ ఆమోదం పొందింది. ఈ పది మందితో పాటు ఇటీవల పార్టీ మారిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలను కూడా టీఆర్ఎస్ అనుబంధ సభ్యులుగా గుర్తిస్తున్నామని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి నిర్ణయాన్ని ప్రకటించారు. దీంతో ఈ 12 మంది సభ్యులకు అధికార పార్టీ పక్కనే అసెంబ్లీలో సీట్లు కేటాయించనున్నారు.
టీఆర్ఎస్ అనుబంధ సభ్యులుగా గుర్తించిన జాబితాలో… తలసాని శ్రీనివాస యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రకాశ్ గౌడ్, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, తీగల కృష్ణారెడ్డి, ధర్మారెడ్డి, వివేకానంద, రాజేందర్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, సాయన్న, మాగంటి గోపీనాథ్, అరికెపూడి గాంధీలు ఉండగా, టీ-టీడీపీలో ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు. మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య. కాగా, అసెంబ్లీలో టీఆర్ఎస్ సభ్యుల సంఖ్య 83కు చేరింది. ఇదిలా ఉండగా, టీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్, బీఎస్పీ ఎమ్మెల్యేలపై స్పీకర్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
ఇదిలా ఉంటే, స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి తప్పుబట్టారు. స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై తాము న్యాయపోరాటానికి దిగుతామని, చట్ట ఉల్లంఘన అవుతుందని, టీడీపీ ఎమ్మెల్యేల విలీనం అనేది స్పీకర్ పరిధిలో లేదని అన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలో ఉన్న నిర్ణయాన్ని స్పీకర్ ఏ విధంగా తీసుకుంటారని.. ఇది నూటికి నూరుపాళ్లు తప్పని, స్పీకర్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో కొట్టివేస్తారని, గతంలో ఇలాంటి అంశాలపై కోర్టు తీర్పులు ఉన్నాయని రేవంత్ రెడ్డి అన్నారు.



