భారత్-పాక్ మద్య యుద్ధం నేనే ఆపానని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పదేపదే ప్రకటించుకోవడాన్ని భారత్ ఎంతగా తప్పు పడుతున్నప్పటికీ ఆయన మాత్రం ‘తగ్గేదేలే’ అంటున్నారు.
రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తున్నందునే 100 శాతం సుంకాలు విధించానని ఇంతకాలం చెప్పుకుంటున్న ట్రంప్, ఇప్పుడు దానికి మరో కొత్త లైన్ జోడించారు. అదే… భారీగా సుంకాలు విదిస్తానని బెదిరింఛి మరీ భారత్-పాక్ యుద్ధం ఆపానని!
కనుక ఆయన బెదిరింపులకు భయపడి భారత్-పాక్ వెంటనే యుద్ధం ఆపేశాయనుకుంటే మరి సుంకాలు విధించకూడదు కానీ విధించారు కదా?అదీ.. భారత్‌పై 100 శాతం, పాకిస్తాన్‌పై 25-26 శాతం మాత్రమే సుంకాలు విధించడంలో అంతర్యం ఏమిటి?అని ఆలోచిస్తే ట్రంప్ చెపుతున్న మాటలకు, వాస్తవాలకు ఎక్కడా పొంతన ఉండదని స్పష్టమవుతుంది.
అమెరికా మించిన దేశం మరొకటి లేదనుకునే ట్రంప్‌కు, అంతర్జాతీయంగా భారత్ ప్రభావాన్ని, ఎదుగుదలని చూసి సహించడం కష్టమే!
కనుక మొదట సుంకాలు, తర్వాత హెచ్-1బీ వీసాలతో భారత్‌ను లొంగదీసుకోవాలనుకున్నారు. కానీ భారత్ లొంగకపోవడంతో రష్యా చమురు, ఉక్రెయిన్ యుద్ధ నివారణ కొరకే సుంకాలని కధ అల్లారు. కానీ భారత్ లొంగకపోవడంతో ఇప్పుడు భారత్-పాక్ యుద్ధం ఆపేందుకేనంటూ కొత్త లైన్ జోడిస్తున్నారనుకోవచ్చు.
కానీ ఈసారి భారత్ ఆపరేషన్ సింధూర్ 2.0 చేపడితే ట్రంప్ ఎలా ఆపుతారు?ఒకవేళ ఆపలేకపోతే పాకిస్తాన్‌కు అండగా నిలబడి డబ్బు, ఆయుధాలు అందిస్తారా?
అయినా అంతర్జాతీయంగా చైనా ఎదుగుదలని, దాని ప్రభావాన్ని అడ్డుకోలేకపోతున్న ట్రంప్, భారత్‌ని అడ్డుకోవడం దేనికి?
ట్రంప్‌కి ‘అమెరికా ఫస్ట్’ ఆనే కోరిక నిజంగా బలంగా ఉంటే, తన దేశాన్ని ఇంకా ఎలా అభివృద్ధి చేసుకోవాలో ఆలోచించాలి తప్ప భారత్ వంటి మిత్రదేశాలను తొక్కేసి, పాక్ వంటి ఉగ్రవాద దేశాన్ని చంక నెక్కించుకోవడం సబబు కాదని, ఇలాంటి రాజకీయాలు చేస్తూ అగ్రరాజ్యం అనిపించుకుంటే ప్రయోజనం ఉండదని ట్రంప్ ఎంత త్వరగా గ్రహిస్తే అమెరికాకు అంత మంచిది.




