రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తున్నందుకు 50 శాతం సుంకాలు విధించిన ట్రంప్ అవసరమైతే మరో 50 శాతం విదిస్తానని ఇటీవలే హెచ్చరించారు. కానీ భారత్ పట్ల ట్రంప్ తీరుని అమెరికా ఆర్ధిక నిపుణులు, పారిశ్రామికవేత్తలే తప్పు పడుతున్నారు. విమర్శిస్తున్నారు.
ఇటీవల ‘అమెరికా ఫెడరల్ కోర్టు ఆఫ్ అపీల్స్’ కూడా ట్రంప్ సుంకాలను తప్పు పట్టింది. ట్రంప్ సుంకాల వలన అమెరికాలోని విదేశీయులు, అమెరికన్లు ఇబ్బంది పడుతున్నారు.
ట్రంప్ కటిన ఆంక్షలతో అమెరికాకు విదేశీ విద్యార్ధులు తగ్గిపోతే అమెరికన్ యూనివర్సిటీలు నష్టపోతాయి. వీసాల జారీలో ఆంక్షల కారణంగా అమెరికాలోని చిన్నా, పెద్ద ఐటి కంపెనీలకు చాలా ఇబ్బందికరంగా మారాయి. ఇంకా ఇటువంటి అనేక కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి.
ప్రపంచంలో అమెరికా ఒక్కటే బలమైన అగ్రరాజ్యంగా ఉండాలని ట్రంప్ కోరుకుంటున్నారు. కానీ ట్రంప్ వైఖరి వలననే మూడు అతిపెద్ద దేశాలైన భారత్, చైనా, రష్యాలు దగ్గరయ్యాయి. ఈ మూడు నిజంగా చేతులు కలిపితే, అమెరికాకు ప్రత్యామ్నాయంగా మారుతాయి. ఈ విషయం ట్రంప్‌కి కాస్త ఆలస్యంగా అర్ధమైనట్లుంది.
అందుకే మెత్తబడి, “మోడీ ఓ గొప్ప ప్రధానమంత్రి. ఆయనతో నాకు ఎప్పుడూ మంచి స్నేహమే ఉంది. భారత్-అమెరికాల మద్య ప్రత్యేక అనుబందం ఉంది. చిరకాల మిత్రదేశమైన భారత్‌తో ఏర్పడిన ఈ విభేదాలు తాత్కాలికమే. వాటి గురించి ఆందోళన చెందనవసరం లేదు,” అని తన ట్రూత్ సోషల్ మీడియాలో మెసేజ్ పెట్టారు.
ప్రధాని మోడీ కూడా వెంటనే సానుకూలంగా స్పందిస్తూ, “ట్రంప్ సానుకూల వైఖరిని అభినందిస్తున్నాను,” అని సందేశం పెట్టారు.
కనుక త్వరలోనే మళ్ళీ భారత్-అమెరికా మద్య ఈ వాణిజ్య వివాదాలు, అదనపు సుంకాల సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం కనిపిస్తోంది. భారత్‌పై బారీగా సుంకాలు విధించి లొంగదీసుకోవాలని ట్రంప్ అనుకుంటే, ఇప్పుడు ఆయనంతట ఆయనే వెనక్కు తగ్గుతున్నారు. అంటే ట్రంప్ ప్లాన్ బెడిసి కొట్టిందనే కదా అర్ధం.




