మోడీ నా స్నేహితుడే కానీ వాతలు తప్పవు: ట్రంప్‌

Trump Targets India with 25 percent Tariff, Slams Narendra Modi


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ అన్నంత పనీ చేశారు. ఆగస్ట్ 1 నుంచి భారత్‌ దిగుమతులపై 25 శాతం పన్ను విధిస్తున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు.

తాను పదేపదే హెచ్చరిస్తున్నప్పటికీ రష్యా నుంచి భారత్‌ పెద్ద ఎత్తున ఆయుధాలు, చమురు కొనుగోలు చేస్తున్నందున ఈ పన్నులకు అదనంగా భారత్‌పై జరిమానా కూడా విధిస్తున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు.

ADVERTISEMENT

ఇంతే కాదు… ఇరాన్ నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు ఆరు భారతీయ కంపెనీలపై ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు.

తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అన్నట్లు ప్రధాని మోడీ నాకు మంచి మిత్రుడే కానీ ఇటువంటి విషయాలలో కాదని ట్రంప్‌ చెప్పారు. అమెరికా వాణిజ్య ప్రయోజనాలకు భంగం కలిగిస్తున్న ‘బ్రిక్స్’లో భారత్‌ సభ్య దేశమని, అమెరికాని, డాలర్‌ని శాశించాలనుకుంటే ఎవరినీ ఉపేక్షించే ప్రసక్తే లేదని ట్రంప్‌ చాలా స్పష్టంగా చెప్పారు.

ట్రంప్‌ ప్రకటనతో ముందుగా భారతీయ షేర్ మార్కెట్ గురువారం భారీ నష్టాలతో మొదలైంది. ఉదయం 10.00 గంటలకు సెన్సెక్స్ ఏకంగా 640 పాయింట్లు నష్టపోయి 80,851 వద్ద ట్రేడ్ అవుతుండగా, నిఫ్టీ 190 పాయింట్ల నష్టంతో 24,664 వద్ద ఉంది. ఈ కారణంగా అనేక కంపెనీల షేర్లు తీవ్రంగా నష్టపోతున్నాయి.

ట్రంప్‌ ప్రకటనతో అమెరికాకు ఎగుమతి అవుతున్న అనేక రకాల ఉత్పత్తులు, సేవల రంగాలపై తీవ్ర ప్రభావం పడుతుంది.

భారత్‌పై 25 శాతం పన్నుతో పాటు జరిమానా కూడా విధించగా, ఇండోనేషియాపై 20 శాతం, వియత్నాంపై 19 శాతం మాత్రమే పన్నులు విధించారు. కనుక ఆ దేశాల కంటే భారత్‌ ఎక్కువ పన్ను చెల్లించాల్సి రావడం వలన మన వ్యాపారాలను వాటికీ వదిలేసుకోక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. కనుక ఈవిదంగా కూడా భారత్‌ మరికొంత నష్టపోతుంది.

వీటన్నిటితో భారత్‌ ఆర్ధిక వ్యవస్థ తీవ్ర ప్రభావితం అవుతుంది కనుక దానిని గాడిన పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం బలమైన సరైన నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది.

కానీ ఎన్నికల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం ఎప్పటికప్పుడు ప్రజాకర్షక పధకాలు ప్రవేశపెట్టడంపై చూపుతున్న శ్రద్ధ ఆర్ధిక క్రమశిక్షణ పాటించడంపై చూపడం లేదు. కనుక ఈ ఈ ప్రభావం వలన కలిగే నష్టాలను, భారాన్ని సామాన్య ప్రజలకి బదిలీ చేసేసి చేతులు దులుపుకుంటే ప్రజల జీవనం ఇంకా కష్టమవుతుంది.

నాడు ఇస్రోకి క్రయోజిక్ ఇంజన్లను, దాని టెక్నాలజీని ఇచ్చేందుకు రష్యా నిరాకరించినప్పుడు ఇస్రో శాస్త్రవేత్తలు నిరాశతో చేతులేత్తేయలేదు. దానిని ఓ సవాలుగా స్వీకరించి స్వయంగా అభివృద్ధి చేశారు.

అదేవిదంగా అమెరికా లేదా ట్రంప్‌ వంటివారు ఈవిదంగా పదేపదే భారత్‌కు నష్టం కలిగించే నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు, వారిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రాకులాడే బదులు, ప్రధాని మోడీ చెపుతున్న ‘ఆత్మ నిర్భర్ భారత్‌’పై మరింత దృష్టి పెట్టి స్వయం సంవృద్ది సాధించగలిగితే, అమెరికాకే పన్నులు, షరతులు విధించేస్థాయికి భారత్‌ ఎదగుతుంది. లేకుంటే ట్రంప్‌, పుతిన్‌, నెతన్యాహూ వంటి వారి దయాదాక్షిణ్యాల కోసం ఎప్పటికీ వెంపర్లాడుతూ ఉండాల్సిందే!

ADVERTISEMENT
Latest Stories