తిరుమల వెంకన్న యోగ నిద్రను విరమించి, ముక్కోటి దేవతలకూ దర్శనమిచ్చే శుభవేళ, తాము కూడా దేవదేవుని దర్శించుకోవాలని వచ్చిన భక్తుల సంఖ్య గతంలో ఎన్నడూ లేనంతగా పెరగడంతో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక ప్రకటన చేసింది. ఈ మధ్యాహ్నం 12 గంటల తరువాత క్యూ లైన్లోకి ఎవరినీ అనుమతించబోమని, వారికి వైకుంఠ ద్వార దర్శనం ఉండబోదని స్పష్టం చేస్తూ చేతులెత్తేసింది.
ఇప్పటికే లక్షా 60 వేల మంది దర్శనానికి వేచి చూస్తున్నారని, నిరంతరాయంగా శనివారం అర్ధరాత్రి వరకూ స్వామి వారి దర్శనానికి వీరిని అనుమతిస్తామని వెల్లడించారు. ఈ ఉదయం నుంచి క్యూ లైన్లలోకి ప్రవేశించిన వారు కనీసం 30 గంటల పాటు దర్శనానికి వేచి చూడాల్సి వుంటుందని, వారిని నేటి రాత్రికి క్యూ కాంప్లెక్స్ లోకి చేర్చేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. కాగా, వీఐపీల దర్శనాన్ని గంట నుంచి గంటన్నరలో ముగిస్తామని చెప్పిన అధికారులు, దాదాపు 3500కు పైగా టికెట్లు జారీ చేసి, వారి కోసం సుమారు 4 గంటల పాటు సామాన్య భక్తులకు దర్శనం లేకుండా చేయడంపై ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2, 1 లోని అన్ని కంపార్టుమెంట్లూ నిండిపోయి, నారాయణగిరి ఉద్యానవనంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక షెడ్లు నిన్ననే నిండిపోగా, ఈ ఉదయం తరలివచ్చిన భక్తులను వరాహస్వామి గెస్ట్ హౌస్, తరిగొండ వెంగమాంబ నిత్యాన్నసత్రం, కల్యాణ వేదిక మీదుగా ఔటర్ రింగ్ రోడ్డు వైపు మళ్లించారు. ఔటర్ లో వాహన రాకపోకలను నిలిపివేశారు. ఆలయానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరం వరకూ భక్తులు కిక్కిరిసి పోగా, క్యూ కాంప్లెక్స్ లో ఖాళీ అయిన గదుల్లోకి వీరిని తరలిస్తున్నామని అధికారులు తెలిపారు. వైకుంఠ ఏకాదశి నాడు ఇంత ఎక్కువగా భక్తులు రావడం ఇదే తొలిసారని, గత రికార్డులు నేటితో చెరిగిపోతాయని చెబుతున్నారు.



