టీఆర్ఎస్ కీలక నేత, తెలంగాణ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలోని షిరిడీ సాయి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. జిల్లాలోని లింగపాలెం మండలం మఠంగూడెంలో స్థానిక మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల మధ్య అనుబంధం ఏ మాత్రం చెడలేదని పేర్కొన్నారు.
ఒకే జాతి, ఒకే భాష, ఒకే సంస్కృతి ఉన్న ఏపీ, తెలంగాణలు రాజ్యాంగబద్ధంగా విడిపోయినా…. వాటి మధ్య అనుబంధం కొనసాగుతుందని అన్నారు. నైసర్గికంగా తెలంగాణా పై భాగాన ఉండగా, ఏపీ కింది భాగాన ఉందని… విడిపోయిన తర్వాత రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలు పుట్టుకొస్తుంటాయని… అయితే ఏపీ, తెలంగాణ విషయాల్లో మాత్రం అలా జరగలేదని తుమ్మల ప్రస్తావించారు.
తెలంగాణాలో ఎన్ని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టినా… దుమ్ముగూడెం వరకు మాత్రమే తాము గోదావరి నీటిని వాడుకునే అవకాశం ఉందన్నారు. ఏదేమైనా, రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు తలెత్తినప్పుడు వాటిని పరిష్కరించుకునేందుకు ఇరు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, కేసీఆర్ సహకరించుకుంటామని ఒప్పందం చేసుకున్నారని పేర్కొన్నారు.



