టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టయ్యి నాలుగు రోజులైంది. ఆయన అరెస్టుని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా టిడిపి శ్రేణులు ధర్నాలు, రిలే నిరాహారదీక్షలు చేస్తున్నారు. మరికొంతమంది ఆయన త్వరగా జైలు నుంచి బయటకు రావాలని కోరుతూ ప్రత్యేక పూజలు, యాగాలు చేస్తున్నారు.
దేశవ్యాప్తంగా వివిద పార్టీల నేతలు, ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడుని అరెస్టుని ఖండిస్తున్నారు. ఇప్పుడే నిద్ర మేల్కొన్నట్లు తెలుగు సినీ ప్రముఖులు కూడా మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడి అరెస్టును ఖండిస్తున్నారు. మరోపక్క చంద్రబాబు నాయుడు తరపున ఏపీ ఏసీబీకోర్టు, హైకోర్టులో న్యాయపోరాటాలు కొనసాగుతున్నాయి. రాజకీయాలలో ఇవన్నీ సాధారణ ప్రక్రియగానే భావించవచ్చు.
కనుక ఇప్పుడు మొట్టమొదట ‘చంద్రబాబు నాయుడు లేని టిడిపి’ ఇప్పుడు తనను తాను నిరూపించుకోవలసి ఉంది. ఆయన లేని సమయంలో ఏవిదంగా ధైర్యంగా నిలబడి, నక్క జిత్తులు ప్రదర్శిస్తున్న వైసీపిని ఎదుర్కొని పోరాడుతుందనేదే చాలా ముఖ్యం.
చంద్రబాబు నాయుడుని అన్యాయంగా ఈ కేసులో ఇరికించారని, జైల్లో నుంచి బయటకు రాకుండా వైసీపి ప్రభుత్వం కుట్రలు చేసవందని, ఓ పధకం ప్రకారం దుష్ప్రచారం చేస్తోందంటూ టిడిపి నేతలు చేస్తున్న ఆరోపణలు వైసీపికి ఆక్రోశంగా వినిపిస్తుంటాయని గ్రహిస్తే మంచిది.
చంద్రబాబు నాయుడుని జైలుకి పంపినందుకే స్వీట్లు పంచుకొని పండుగ చేసుకొనే పైశాచిక ఆనందం పొందుతున్న వైసీపి నేతలకు, టిడిపి నేతల ఈ ఆక్రోశం మరింత ఆనందం కలిగిస్తుందే తప్ప ఎటువంటి నష్టమూ కలిగించదని గ్రహిస్తే, వైసీపిని ఏవిదంగా ఎదుర్కోవాలని ఆలోచించడం మొదలుపెట్టగలుగుతారు.
వైసీపి కుట్రలు పన్నుతుందని తెలిసి ఉన్నప్పుడు వాటిని వల్లె వేస్తూ బాధపడటం కాదు… పదునైన వ్యూహాలతో వైసీపి కుట్రలను ఎదుర్కోవాలి. ఈ సమయంలో బేలతనం, పిరికిమాటలు అసలు పనికిరావని టిడిపి నేతలందరూ గ్రహించాలి.
చంద్రబాబు నాయుడు తమ మద్య ఉన్నప్పుడు టిడిపి నేతలు ఎంత ఉత్సాహంతో, ధైర్యంతో ఉరకలు వేసేవారో, ఇప్పుడూ ఆ స్పూర్తితో పోరాడగలిగినప్పుడే, వారు టిడిపి శక్తివంతమైనదని నిరూపించగలుగుతారు.
చంద్రబాబు నాయుడు ఎక్కడికో వెళ్ళిపోలేదు. తమ పక్కనే రాజమండ్రిలో ఏకాంతంగా ఉన్నారని భావిస్తూ ఎప్పటిలాగే వైసీపిని ధీటుగా ఎదుర్కొన్నప్పుడే, ప్రజలు, వైసీపి కూడా టిడిపి శక్తి సామర్ధ్యలను గుర్తిస్తారు.
ఈ క్లిష్ట సమయం టిడిపి శక్తి సామర్ధ్యలను నిరూపించుకొనేందుకు లభించిన ఓ అవకాశంగా గుర్తిస్తే టిడిపి నేతలు తమ ఆలోచనలకు, వ్యూహాలకు పదును పెట్టగలుగుతారు.





