ఓ పక్కన రెండు తెలుగు రాష్ట్రాలు అగ్ని గోళాలను తలపిస్తూ… ఒక్కసారిగా 45 నుండి 48 డిగ్రీల నడుమ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో బయటకు రావాలంటే ప్రజలు భయబ్రాంతులకు గురి కావలసిన పరిస్థితి నెలకొంది. ఇంతటి మండుటెండలో నీటి ఆవశ్యకత ఏ మేరకు ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నీళ్ళకు కటకటలాడే పరిస్థితుల్లో, గుక్కెడు నీళ్ళైనా చాలా జాగ్రత్తగా వ్యవహరించే రోజులు. కానీ ఓ అపరిచితుడు కారణంగా విజయవాడ, ప్రకాశం బ్యారేజ్ లోని నీళ్ళు వృధాగా పోవడం విశేషం.
ప్రకాశం బ్యారేజ్ పది గేట్లను ఒక అడుగు మేరకు ఓ అపరిచిత వ్యక్తి ఎత్తివేసిన సంఘటన అధికారులను కలవరపెట్టింది. అయితే వెంటనే విషయం తెలుసుకున్న ఇరిగేషన్ శాఖ అధికారులు అప్రమత్తమై, ఆయా గేట్లను కిందకు దించివేశారు. గేట్లు ఎత్తిన వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అయితే ఓ గుర్తు తెలియని వ్యక్తి బ్యారేజ్ గేట్లు ఎత్తడంపై పలు విమర్శలు తలెత్తాయి. ఈ సంఘటన నేపథ్యంలో బ్యారేజ్ భద్రత విషయమై స్థానికంగా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వర్షాకాలంలోనే నీళ్ళు లేక గేట్లు ఎత్తే పరిస్థితి లేకపోయింది. కానీ, ఇంత మండు వేసవిలో నీటిని విడుదల చేయడంపై బ్యారేజ్ పై వెళ్తున్న ప్రజానీకం ఆశ్చర్యం వ్యక్తం చేసారు. ఇటీవలే బ్యారేజ్ మరమ్మత్తుల నిమిత్తం విచ్చేసిన పలువురు కార్మికులు, బ్యారేజ్ దిగువనే గుడారాలు వేసుకుని నివసిస్తున్నారు. ఒక్కసారిగా నీళ్ళు వారిని తాకడంతో షాక్ గురవ్వడం సదరు కార్మికుల వంతయ్యింది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకపోవడం హర్షించదగ్గ విషయం.


