ఆంధ్రప్రదేశ్ లో అంతర్జాతీయ పట్టణంగా పేరున్న విశాఖపట్టణంలో వెలుగు చూసిన 1500 కోట్ల కుంభకోణం… వైజాగ్ వాసులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంత పెద్ద కుంభకోణమా? 1500 కోట్ల రూపాయలా? అంటూ అంతా ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ కుంభకోణం ఎలా బయటపడిందా? అని అంతా ఆసక్తిగా తెలుసుకుంటున్నారు. కోల్ కతాలో ఉల్లిపాయల ఏజెంట్ గా పని చేసిన శ్రీకాకుళానికి చెందిన వడ్డి శ్రీనివాసరావు, అక్కడ సంపాదించిన డబ్బుతో శ్రీకాకుళం పరిసరాల్లో చిన్నపాటి మైనింగ్ వ్యాపారం ప్రారంభించారు. చుట్టు పక్కలవారు చూస్తుండగానే ఆ కుటుంబం మారిపోయింది. ఇల్లు, జీవన విధానం ఇలా అన్నింట్లో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి.
ఖరీదైన కార్లు, విలాసాల టూర్లు ప్రారంభమయ్యాయి. ఇలాంటి వారి బ్యాంకు లావాదేవీలపై ఐటీ విభాగం ఒక కన్నేసి ఉంచుతుంది. ఎవరికీ తెలియకుండా హవాలా వ్యాపారంలో కోట్లు పోగేసిన వడ్డి మహేశ్ ఇటీవల మెర్సిడెజ్ బెంజ్ కారు కొన్నాడు. దీంతో అతని ఆర్థిక మూలాలపై ఆరాతీసింది. శ్రీకాకుళంలో చిన్న మైనింగ్ కంపెనీ పెట్టిన వ్యాపారికి బెంజ్ లగ్జరీ మోడల్ కొనేంత లాభాలా? అని ఆశ్చర్యపోయిన ఐటీ శాఖాధికారులు. మరింత లోతుగా వెళ్లగా… వందల కోట్ల హవాలా డొంక కదిలింది. తండ్రి సహకారంతో మహేష్… ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో వ్యాపారాలు చేస్తున్నామంటూ పలు షెల్ కంపెనీలు సృష్టించారు.
తప్పుడు టర్నోవర్ నివేదికలను పుట్టించారు. వివిధ పేర్లతో భారీ సంఖ్యలో పాన్ కార్డులు సమకూర్చుకున్నారు. మొత్తం 12 ఉత్తుత్తి కంపెనీల పేరిట ఏకంగా 29 బ్యాంకు ఖాతాలు తెరిచారు. వాటిలో 12 ఖాతాలు వడ్డి మహేశ్ కుటుంబ సభ్యులవే కావడం విశేషం. ఈ బ్యాంకు ఖాతాల ద్వారా హవాలా మార్గంలో డబ్బును విదేశాలకు తరలించడం మొదలుపెట్టారు. ఒక్క డాలరుకు 85 పైసల కమీషన్ చొప్పున తీసుకుని భారీ ఎత్తున… విదేశాల నుంచి కస్టమైజ్డ్ కంప్యూటర్ సాఫ్ట్ వేర్ కొనుగోలు చేస్తున్నామని చెబుతూ… నెఫ్ట్, ఆర్టీజీఎస్ ద్వారానే చైనా, హాంకాంగ్, సింగపూర్ దేశాలకు డబ్బు పంపారు.
రెండేళ్ల పాటు నిర్వహించిన ఈ దందాలో 569 కోట్ల రూపాయలు విదేశాలకు పంపినట్టు ఐటీ శాఖాధికారులు గుర్తించారు. దీంతో లెక్కలు వేసిన అధికారులు మొత్తం 1500 కోట్ల రూపాయలు ఈ కుంభకోణంలో చేతులు మారినట్టు గుర్తించారు. తొలి దశలో 578 కోట్ల రూపాయలు వీరి 29 అకౌంట్లలో జమ కాగా, అందులో 569 కోట్ల రూపాయలు వేర్వేరు ఖాతాలకు బదిలీ అయినట్లు గుర్తించారు. తరువాత 800 కోట్ల రూపాయలు హవాలా మార్గంలో చైనా, హాంకాంగ్, సింగపూర్ తదితర దేశాల్లోని ఐదు కంపెనీలకు తరలించినట్లు గుర్తించారు. దీని కోసం తమ మైనింగ్ కంపెనీలోని ఉద్యోగుల పేర్లను కూడా వాడుకున్నట్టు ఐటీ అధికారులు గుర్తించారు.
ఈ కుంభకోణంలో వడ్డి మహేష్, వడ్డి శ్రీనివాసరావు, ఆచంట హరీష్, ఆచంట రాజేష్, ప్రశాంత్ కుమార్ రాయ్, ప్రవీణ్ కుమార్ రాయ్, ప్రవీణ్ కుమార్ ఝా, ఆయేష్ గోయెల్, దిలీప్ గొయెంకా, వికార్ గుప్తాలు ప్రధాన సూత్రధారులు. వీరిపై ఐదు సెక్షన్లపై కేసులు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నారు. దీని వెనుక బడా రాజకీయ నాయకుడు ఒకరు ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మహేష్, శ్రీనివాసరావు, హరీష్, రాజేష్ లను వైజాగ్ లోని ఎంవీపీ పోలీస్ స్టేషన్ లో విచారిస్తున్నారు. అంతే కాకుండా, వారికి సంబంధించిన 30 బ్యాంకు ఖాతాలను సీజ్ చేశారు. కోల్ కతాలోని నిందితులను అరెస్టు చేసేందుకు పోలీస్ టీమ్స్ బయల్దేరాయి.



