టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ గురువారం రాష్ట్రంలో పదో తరగతి విద్యార్దులతో జూమ్ మీటింగ్ నిర్వహించబోతే, దానికి గన్నవరం వైసీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, మాజీ మంత్రి కొడాలి నాని హాజరయ్యారు. వారితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ డిజిటల్ డైరెక్టర్ జి. దేవందర్ రెడ్డి హాజరవడం విశేషం.
తాను విద్యార్ధులతో మాట్లాడుతుండగా మద్యలో దొంగ ఐడీలతో మీరు ఎందుకు హాజరయ్యారని నారా లోకేష్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో వల్లభనేని వంశీ మర్యాదగా వెళ్లిపోగా జి. దేవందర్ రెడ్డి నారా లోకేష్‌తో వాగ్వాదానికి దిగారు. ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగితే రసాభాసగా మారే ప్రమాదం ఉందని గ్రహించిన జూమ్ మీటింగ్ నిర్వాహకులు వెంటనే దానిని అర్దాంతరంగా నిలిపివేశారు.
ఇటీవల వెలువడిన పదో తరగతి పరీక్షలలో ఉత్తీర్ణత శాతం చాలా తక్కువగా ఉండటంతో కొంతమంది విద్యార్దులు ఆత్మహత్యలు చేసుకొన్నారు. కనుక నారా లోకేష్ నేరుగా విద్యార్దులతో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకొని వారికి ధైర్యం చెపుదామని జూమ్ మీటింగ్ నిర్వహించాలనుకొన్నారు.
కానీ నారా లోకేష్ జూమ్ మీటింగ్ నిర్వహించబోతున్నారని తెలుసుకొన్న వల్లభనేని, కొడాలి నాని, దేవేందర్ రెడ్డి ముగ్గురు విద్యార్దుల తరపున ఐడీలు తీసుకొని నారా లోకేష్ జూమ్ మీటింగ్ మొదలుపెట్టగానే మద్యలో దూరి రాజకీయాలు చేసేందుకు ప్రయత్నించారు.
వైసీపీ నేతల తీరుపై నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, “పదో తరగతి పరీక్షలను సక్రమంగా నిర్వహించలేకపోయింది వారి ప్రభుత్వం. పరీక్షలలో ఉత్తీర్ణత శాతం తగ్గిపోతే వారు ఏమాత్రం సిగ్గుపడటంలేదు. విద్యార్దులు ఆత్మహత్యలు చేసుకొంటుంటే వారికి ఎవరూ ధైర్యం చెప్పరు. కానీ వారు చేయని పని నేను చేస్తుంటే దానికీ వారు అడ్డుపడ్డారు. మాతో రాజకీయాలు చేయాలనుకొంటే చేసుకోండి. కానీ విద్యార్దుల జీవితాలతో ఆటలాడవద్దని సూచిస్తున్నాను. పదో తరగతి చదువులు, పరీక్షలపై వైసీపీ నేతలకు అంత అవగాహన ఉన్నట్లయితే ఇలా దొంగచాటుగా జూమ్ మీటింగులలో దూరి మాట్లాడటం కాదు… బహిరంగంగానే ముఖాముఖిగా చర్చిద్దాము.. వస్తారా? అంత దమ్ముందా మీకు?” అని సవాల్ విసిరారు.
వల్లభనేని వంశీ మీడియాతో మాట్లాడుతూ, “మేమేమి మోహాలకు ముసుగులు వేసుకొని జూమ్ మీటింగులోకి రాలేదు. నేరుగానే వచ్చాము. ఈ సమావేశంలో నారా లోకేష్ విద్యార్దులతో ఏమి మాట్లాడుతారో విందామని వచ్చాము. టిడిపి వాదనలపై మాకు కూడా కొన్ని సందేహాలున్నాయి. వాటిని అడుగుదామని వచ్చాము. కానీ అర్దాంతరంగా ఆయన జూమ్ మీటింగ్ క్యాన్సిల్ చేసుకొని వెళ్ళిపోతే అది మా తప్పు కాదు, “ అని అన్నారు.
విద్యార్దులకు కేటాయించిన ఐడీలతో ముగ్గురూ ఈ జూమ్ మీటింగులోకి ముందుగా అనుకొన్న పధకం ప్రకారమే ప్రవేశించారని అర్ధమవుతోంది. చివరికి విద్యార్దుల సమావేశాన్ని కూడా వైసీపీ నేతలు ఈవిదంగా రాజకీయ వేదికగా వాడుకోవాలని ప్రయత్నించడం చాలా దురదృష్టకరం.



