ముఖ్యమంత్రిపై జగన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై టిడిపి నేతల ఆగ్రహ జ్వాలలు ఇప్పట్లో ఆగేలా లేవు. ఒక్కొక్కరు మీడియా ముందుకు వచ్చి జగన్ ను తూర్పారపట్టడంలో నిమగ్నమవుతున్నారు. తాజాగా జగన్ పై మండిపడిన వారి జాబితాలో వర్ల రామయ్య, చింతమనేని ప్రభాకర్ తదితరులు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ హాట్ గా వినపడుతున్నాయి.
“పనికిమాలిన వాడా… మీ నాన్నకు సమకాలీకుడు… అతన్ని కొడతావా? మీ నాన్న బతికుంటే ఆయన్ను కూడా కొడతావు నువ్వు… అటువంటి పనికిమాలిన వాడివి… స్టుపిడ్ ఫెలో” అని జగన్ ను ఉద్దేశించి తల్లి విజయమ్మ తిట్టాల్సిన తిట్లు అంటూ… జగన్ పై నిప్పులు చెరిగారు టిడిపి నేత వర్ల రామయ్య. చెప్పాల్సినదంతా చెప్పిన తర్వాత… ఇవన్నీ తాను అంటున్నవి కావని, జగన్ తల్లి విజయమ్మ తిట్టాల్సినవని ముక్తాయింపు ఇచ్చి ట్విస్ట్ ఇచ్చారు వర్ల.
“నీ తల్లిని చెప్పమను… విజయమ్మ గారిని చెప్పమను… నా కొడుకు చేసిన వ్యాఖ్యలు సరైనవేనని..! నీ భార్య భారతిని చెప్పమను… నా భర్త సరిగ్గానే మాట్లాడాడని..! వారు చెప్పలేరు. నేను అడుగుతున్నా… భారతీదేవీ.., నీ భర్త మాటలను సపోర్టు చేస్తారా? యస్… నా భర్త కరెక్టుగా మాట్లాడారని చెప్పగలరా? నా భర్త బహు చక్కగా మాట్లాడుతున్నారని చెప్పమనండి. ఆమె చెప్పలేరు. నీవు మనిషివా? మానవత్వం ఉందా? ఇంగితజ్ఞానం లేని నువ్వేం నాయకుడివయ్యా..! జగన్… నీ మీద అసభ్య పదజాలం కూడా వాడాలని అనిపించింది. కానీ వాడను…” అంటూ విరుచుకుపడ్డారు వర్ల రామయ్య.
ఇక, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అయితే వైఎస్సార్సీపీ అధినేత జగన్ కు సవాలు విసిరారు. జగన్ నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నాడని… ఏలూరు… రా… నిన్ను చెప్పు తీసుకుని కొట్టకపోతే నేను ప్రభాకర్ నే కాదు… అంటూ సవాలు విసిరారు. ఇక నుండి ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించిన చింతమనేని…, ముఖ్యమంత్రిని విమర్శిస్తే చూస్తూ ఊరుకుంటామనుకుంటున్నావా? పద్దతిగా మాట్లాడడం నేర్చుకోవాలని ఈ సందర్భంగా హితవు పలికారు.
మరో కీలకనేత, ఏపీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ… జగన్ కు రోజులు దగ్గర పడ్డాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే జగన్ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం ఖాయమని, ఇప్పటికే 43 వేల కోట్ల విలువ చేసే జగన్ ఆస్తులను ఈడీ అటాచ్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. పుట్టుకతోనే నేర చరిత్ర ఉన్న జగన్ కు చంద్రబాబును విమర్శించేంత స్థాయి లేదని యనమల ధ్వజమెత్తారు.



