వైసీపీ పార్టీ పునాదులు వేసుకున్న నాటి నుంచి పార్టీ కి అండగా ఉంటూ జగన్ నాయకత్వాన్ని బలపరిచిన నేతలు ఒక్కక్కొరుగా పార్టీని వీడుతున్నారు. వీరిలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డి జగన్ తో విభేదించి చాల కాలం క్రిందటే టీడీపీ పార్టీలో చేరారు.
అయితే ఎన్నికలు దగ్గర పడడంతో రాష్ట్రంలో ప్రజల నాడి ఎటువైపుకి ఆకర్షించబడుతుందో తెలుసుకోగల రాజకీయ నాయకులు అందుకు అనుగుణంగా తమ రాజకీయ అడుగులు కదుపుతూ ఉంటారు. ఇందులో భాగంగా తన ఒంటెద్దు పోకడలతో పార్టీలోని ముఖ్య నాయకులను సైతం పట్టించుకోకుండా ”ప్రత్యర్దులను బూతులు తిట్టు సీటు పట్టు” అనే పథకాన్ని ప్రవేశపెట్టి రాజకీయాలలోకి కొత్త సంస్కృతిని తీసుకువచ్చిన జగన్ తో కలిసి పని చేయలేక వైసీపీ ని వీడుతున్నారు ఆ పార్టీ సీనియర్ లీడర్లు.
ఈ కోవలోకే వస్తారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. వైసీపీ పార్టీ సభ్యత్వానికి ఆ పార్టీ జిల్లా అధ్యక్ష్య పదవికి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి తన రాజీనామా లేఖను పార్టీ అధిష్టానానికి పంపారు వేమి రెడ్డి. ఆయనతో పాటుగా టిటిడి బోర్డు సభ్యురాలిగా ఉన్న ఆయన భార్య ప్రశాంతి కూడా తన పదవికి రాజీనామా చేసి వైసీపీ కి గుడ్ బై చెప్పారు.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గా ఉండి వైసీపీ కి రాజీనామా చేసిన కోటంరెడ్డి, వెమిరెడ్డిని కలిసి తనకు సంఘీభావం తెలియచేసారు. వేమి రెడ్డి దంపతులు త్వరలో టీడీపీ కండువా కప్పుకోబుతున్నారనే సమాచారంతో కోటంరెడ్డి ఆయనను కలిసి టీడీపీ తరుపున కలిసి పనిచేద్దాం అంటూ వేమిరెడ్డి నిర్ణయానికి మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా నిజాయితీగా రాజకీయాలు చేసే నాయకులు జగన్ దగ్గర ఎంతోకాలం నిలవలేరంటూ కోటం రెడ్డి వాపోయారు.
అలాగే ఒంగోలు వైసీపీ ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసుల రెడ్డి కూడా పార్టీ అధిష్టానం పై అసంతృప్తితో ఉన్నారని, త్వరలోనే ఈయన కూడా పార్టీకి, పార్టీ అధిష్ఠానానికి ఒక నమస్కారం పెట్టి సంస్కారం లేని చోట పని చేయలేమని బయటకు రానున్నారని మీడియాలో వార్తలు ఊపందుకున్నాయి. బాలినేని ఇప్పుడా అప్పుడా అన్నట్టుగా కొంతకాలంగా పార్టీలోనే ఉంటూ తన అసంతృప్తిని బయటపెడుతూనే వస్తున్నారు.
అలాగే వైసీపీ మరో ఎంపీ లావు కృష్ణ దేవరాయలు కూడా వైసీపీ కి ప్యాక్ అప్ చెప్పి పసుపు జెండాకు వెల్కమ్ చెప్పడానికి సిద్ధమయ్యారు. జగన్ సిద్ధం అంటూ 25 కి 25 ఎంపీ లు వైసీపీ పార్టీకే ఇవ్వండి అంటూ ప్రజలను వేడుకుంటుంటే పార్టీలో మాత్రం ఒక్కొక్క ఎంపీ పార్టీని వీడుతున్నారు. వైసీపీ నుంచి బయటకు వస్తున్న ప్రతి నాయకుడు చెపుతున్న కామన్ పాయింట్ అండర్ లైన్ చేస్తే ఎవరైనా బూతులు తిట్టు సీటు పట్టు పథకంలో సభ్యులుగా లేకపోతే వారు ఎంతటి నాయకుడైన తమకు, తమ పార్టీకి అవసరం లేదని జగన్ తెగేసి చెపుతున్నారట.




