కోలీవుడ్ హీరో విజయ్ హీరోగా నటించిన జన నాయగన్ (తెలుగులో జన నాయకుడు) రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సి ఉంది. కనుక నేడు ప్రీమియర్స్ పడాలి. కానీ సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ నిరాకరించింది. నిర్మాణ సంస్థ మద్రాస్ హైకోర్టుని ఆశ్రయించింది. ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత తీర్పు రిజర్వ్ చేసింది. రేపు ఉదయం ప్రకటిస్తుంది. కనుక రేపు విడుదలయ్యే అవకాశం లేదు.
విజయ్ ఈ సినిమాతో సినీ పరిశ్రమకు గుడ్ బై చెప్పేసి తన సొంత పార్టీ తమిళగ వెట్రి కజగంతో తమిళనాడు రాజకీయాలలో పాల్గొనేందుకు సిద్దమయ్యారు. బహుశః ఇదే కారణంగా ఆయన సినిమాకు అవరోధాలు ఏర్పడుతున్నయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తమిళనాడులో ప్రస్తుతం స్టాలిన్ నేతృత్వంలో డీఎంకే అధికారంలో ఉంది. ఆయన వారసుడు ఉదయనిధి స్టాలిన్ కూడా అప్పుడే ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి సిద్ధంగా ఉన్నారు.
అధికార డీఎంకేతో కాంగ్రెస్ పార్టీ, అన్నాడీఎంకేతో బిజేపి ఉన్నాయి. ఈ రెండు జాతీయ పార్టీలు కూడా తమిళనాడులో పాగా వేయడానికి చాలా కాలంగా ప్రయత్నిస్తున్నాయి. కానీ ఫలించడం లేదు.
జయలలిత మరణం తర్వాత శశికళ చక్రం తిప్పి అన్నాడీఎంకేని కబ్జా చేయబోతే ఏం జరిగిందో అందరికీ తెలుసు. పార్టీలో, రాష్ట్ర రాజకీయాలలో దశాబ్దాలుగా ఉన్న ఆమెకే ఆ గతి పడితే, విజయ్ సొంత పార్టీతో రాగానే ఆ రెండు పార్టీలు, వాటి వెనుకున్న కాంగ్రెస్, బిజేపిలు ఆయనకు ఎర్ర తివాచీ పరిచి స్వాగతం పలకవు కదా?
గత ఏడాది సెప్టెంబర్ 27న కరూర్‌లో విజయ్ దళపతి పార్టీ ర్యాలీ నిర్వహించారు. దానిలో తొక్కిసలాట జరిగి 41 మంది చనిపోయారు. ఆ ఒక్క కేసు చాలు విజయ్‌ని ముప్పతిప్పలు పెట్టి కట్టడి చేయడానికి. భారీ బడ్జెట్‌తో తీసిన ‘జన నాయకుడు’కి సెన్సార్ బ్రేకులు వేయడానికి ఇదే కారణంగా కనిపిస్తోంది.
కనుక సినిమాలలో దళపతి అనిపించుకోవచ్చు.. జన నాయకుడు అనిపించుకోవచ్చు.. మరేదైనా అనిపించుకోవచ్చు. కానీ రాజకీయాలలో రాణింఛి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవాలంటే ఇలాంటి ఆటుపోట్లు చాలా ఎదుర్కోవాలి. పవన్ కళ్యాణ్‌లాగ వాటన్నిటినీ తట్టుకొని నిలబడి పోరాడుతూనే ఉండాలి. అప్పుడే రియల్ లైఫ్‌లో జన నాయకుడు కాగలరు. మరి విజయ్‌కి అంత ఓపిక, శక్తి సామర్ధ్యాలు ఉన్నాయా? కాలమే చెపుతుంది.






