వైఎస్సాఆర్ కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి వచ్చే ఎన్నికలలో విశాఖపట్నం నుండి లోకసభకు పోటీ చేస్తారనే పుకారు ఒకటి ఉంది. గతంలో ఇదే సీటు నుండి వైఎస్ విజయమ్మ పోటీ చేసి ఓడిపోవడంతో ఇక్కడ పోటీ చేసి గెలవడం అంత తేలిక కాదు అని తేలిపోయింది. దీనితో విజయసాయిరెడ్డి ఇప్పటినుండే అక్కడ తన ప్రయత్నాలు స్టార్ట్ చేసినట్టు ఉన్నారు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజాసంకల్పయాత్రకు సంఘీభావంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ వీ విజయసాయి రెడ్డి పాదయాత్ర చేయనున్నట్లు పార్టీ వెల్లడించింది. వచ్చే నెల 2వ తేదీ నుంచి గ్రేటర్ విశాఖ మన్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 72 వార్డుల్లో 10 రోజుల పాటు 180 కిలోమీటర్లు విజయసాయి పాదయాత్ర చేస్తారని చెప్పారు.
అదే రకంగా నగరంలోని ప్రభుత్వ మహిళా కాలేజీ ఎదురుగా ఉన్న దీక్షా ప్రాంగణం వేదికగా ఈ నెల 30వ తేదీన నయవంచన దీక్షలు చేయనున్నట్టు పార్టీ తెలిపింది. దీనికి కూడా విజయసాయిరెడ్డే అధ్యక్షత వహిస్తారు. మరోవైపు జగన్ పాదయాత్ర 2000 కిలోమీటర్ల మార్కుకు దగ్గర అవుతుంది.



