వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్‌లో మళ్ళీ చెలరేగిపోతున్నారు. మరిచిపోకుండా ప్రధాని నరేంద్రమోడీని, కేంద్ర ప్రభుత్వాన్ని పొగుడుతూనే ఉన్నారు. అలాగే మరిచిపోకుండా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్‌లను విమర్శిస్తూనే ఉన్నారు. అంతేకాదు… ఢిల్లీ పెద్దలకు అర్దమయ్యేందుకు హిందీ, ఇంగ్లీషు భాషల్లో, రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలను విమర్శించేందుకు తెలుగు భాషలో పుంఖానుపుంకాలుగా ట్వీట్స్ చేస్తున్నారు.
విజయసాయి రెడ్డి టిడిపి, జనసేనలను విమర్శిస్తున్నారంటే అర్దం చేసుకోవచ్చు. కానీ అమిత్ షా, జేపీ నడ్డా, ఏపీ బిజెపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తమ ప్రభుత్వాన్ని తూర్పారపడుతున్నా, విజయసాయి రెడ్డి ట్విట్టర్‌లో మోడీ భజన చేస్తుండటం దేనికో అందరికీ తెలిసిందే.
దీని వలన వ్యక్తిగతంగా ఆయన, రాజకీయంగా వైసీపీ మేలు పొందుతూనే బిజెపి విశ్వసనీయతను దెబ్బతీస్తున్నారు. ఇప్పటికే పలు కారణాల వలన ఏపీలో ప్రజలు బిజెపి పట్ల గుర్రుగా ఉన్నారు. తమ రాజకీయ ప్రయోజనాల కొరకు, వైసీపీతో లోపాయికారి స్నేహం కూడా కొనసాగిస్తోందనే ప్రజలు భావిస్తున్నారు.
విజయసాయి రెడ్డి కేంద్రాన్ని పొగుడుతూ పెడుతున్న ట్వీట్స్ చూస్తున్నప్పుడు ప్రజల అనుమానాలను ధృవీకరిస్తున్నట్లనిపిస్తుంది. అంటే ఏపీ బిజెపి అధ్యక్షుడుని మార్చి దగ్గుబాటి పురందేశ్వరిని నియమించినా, ఆమె జగన్ ప్రభుత్వం మీద విరుచుకుపడుతున్నా, ఏపీ బిజెపి విశ్వసనీయత ప్రశ్నార్ధకంగానే ఉంటుందన్న మాట!
ఇక ఈ మద్య విజయసాయి రెడ్డి తరచూ చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేసుకొని ట్విట్టర్‌లో విమర్శలు గుప్పిస్తున్నారు. రాజకీయాలలో ఇది సహజమే. తాజాగా ఆయా ఓ కొత్త విషయం కనిపెట్టి చెప్పారు. “యువగళం, ప్రాజెక్టుల యాత్ర పేరుతో తండ్రీకొడుకులు తిరిగిన ప్రతి నియోజకవర్గంలో డిపాజిట్ గల్లంతవడం ఖాయం. రాజకీయాలకు చీడపురుగులై, వీళ్ల నోటి దురుసుతనం, అరాచకాలు, హింసను రెచ్చగొట్టే ప్రయత్నాలను ప్రజలు అసహ్యించుకుంటున్నారు. బాకా మీడియా పబ్లిసిటీ తప్ప ప్రయోజనం లేదని తేలిపోయింది,” అని ట్వీట్ చేశారు.
టిడిపికి డిపాజిట్లు దక్కవని ఆయన ఏ ప్రతిపదికన తీర్మానించి చెప్పారో తెలీదు కానీ టిడిపి అంత దారుణంగా ఓడిపోతుందని వైసీపీ నేతలు గట్టిగా నమ్ముతున్నట్లయితే, అందరూ హ్యాపీగా ఉండొచ్చు కదా?కానీ నిత్యం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ భజన ఎందుకు చేస్తున్నారు?ఓటర్ల జాబితాలు తారుమారు ఎందుకు చేస్తునట్లు?



