ఇటీవలే జరిగిన మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ మెగా సూపర్ ఈవెంట్ కు అలనాటి హిట్ పెయిర్ చిరంజీవి – విజయశాంతి హైలైట్ గా నిలిచారు. ఈ సినిమాతో విజయశాంతి కమ్ బ్యాక్ చేస్తుంటే, చిరంజీవి ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా వచ్చారు. ఈ సందర్భంగా విజయశాంతిని లేడీ అమితాబ్, లేడీ సూపర్‌స్టార్ అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. ఈ ప్రశంసలపై విజయశాంతి తన ఫేస్‌బుక్ ద్వారా స్పందిచారు.
లేడీ సూపర్ ;స్టార్, లేడీ అమితాబ్ అని చిరంజీవి ప్రశంసించడంతో ఆ పదాలకు ఒక విలువ, పదింతల మర్యాద లభించినట్లు భావిస్తున్నానని ఆమె పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని కల్పించిన అనిల్ రావిపూడి, మహేశ్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఆమె పెట్టిన పోస్టు ఈ విధంగా ఉంది.
“నటనా పరమైన ప్రశంసల వల్ల లభించే సంతోషం ఒకటైతే… కమర్షియల్ సినిమాల విజయంతో సాధించే స్టార్‌డమ్ ఇమేజ్ వల్ల అందుకునే ఆనందం ఇంకొకటి. ఈ రెండూ కళాకారులను అత్యంత ప్రభావితం చేయగలిగే అంశాలే అన్నది నా అభిప్రాయం. జాతీయ ఉత్తమ నటిగా నేను అవార్డు తీసుకున్న సందర్భంలో ఎంత గౌరవంగా భావించానో… నటనకు డిక్షనరీ లాంటి మహానటుడు శివాజీ గణేషన్ గారు నన్ను “గ్రేట్ ఆర్టిస్ట్, నా దత్తపుత్రిక” అని సంబోధించినప్పుడు అంతకుమించి గౌరవంగా భావించాను. అలాగే కమర్షియల్ సినిమాల పరంగా ఎన్ని విజయాలు సాధించినా… లేడీ సూపర్‌స్టార్, లేడీ అమితాబ్ లాంటి అభినందనలు పొందినా… ఆ మాటను తెలుగు సినిమాను కమర్షియల్ పరంగా, కలెక్షన్ల పరంగా అత్యున్నత స్థాయికి తీసుకెళ్లిన మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పడంతో ఆ పదాలకు ఒక విలువ, పదింతల మర్యాద లభించినట్లుగా భావిస్తున్నాను. సాధారణంగా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇలాంటి ప్రశంసలు అందుకోవడం ఆనవాయితీ. కానీ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఫంక్షన్‌లోనే మెగాస్టార్ ద్వారా నేను అభినందనలు అందుకోవడానికి అవకాశం కల్పించిన సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి కృతజ్ఞతలు. `సరిలేరు నీకెవ్వరు` దర్శకుడు రావిపూడిగారితో పాటు… మొత్తం చిత్ర యూనిట్‌కు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను” అన్నారు విజయశాంతి.
ఇకపోతే సంక్రాంతి సందర్భంగా జనవరి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాలో విజయశాంతి లెక్చరర్ భారతిగా కనిపించనున్నారు. కథ ప్రకారం ఇది చాలా కీలకమైన పాత్ర అని అంటున్నారు. ట్రైలర్ లో ఆవిడ ఎంతో హుందాగా ఆకట్టుకునే కనిపించారు.





