పాపం తెలిసే చేస్తున్నారో తెలియక చేస్తున్నారో కానీ…

YSRCP leadership race

విజయసాయి రెడ్డి వైసీపీ నుంచి తప్పుకున్న తర్వాత పార్టీలో నంబర్‌-2 కుర్చీ ఖాళీగా పడుంది. దాని కోసం పార్టీలో అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, పేర్ని నాని ముగ్గురూ పోటీ పడుతున్నట్లు కనిపిస్తోంది.

కనుక అధినేత జగన్‌ను ప్రసన్నం చేసుకునేందుకు ముగ్గురూ పోటాపోటీగా సీఎం చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా అమరావతిపై బురద జల్లుతున్నారు. జగన్ దృష్టిలో పడాలంటే ఇదే సులభమైన మార్గమని వారు భావిస్తున్నట్టుగా ఉంది.

ADVERTISEMENT

అంబటి రాంబాబు అయితే సీఎం చంద్రబాబు నాయుడుపై వ్యక్తిగత విమర్శలు చేసి జైలుకు వెళ్లడానికి కూడా వెనకాడలేదు. తద్వారా జగన్ మనసు గెలుచుకోవడంతో పాటు పనిలో పనిగా రాష్ట్రంలో కాపు సామాజిక వర్గానికి నాయకుడిగా ఎదగాలని కూడా భావించారు.

కానీ ఆయన వాక్చాతుర్యం నోటి దురదగా మారడంతో రేసులో వెనకబదిపోయారు. ముఖ్యంగా పార్టీలో నేతలు, కార్యకర్తలతో సఖ్యత లేకపోవడంతో ఆయన ప్రయత్నాలు సత్తెనపల్లిలో రికార్డింగ్ డాన్సుల్లా వృథా అయిపోతున్నాయి.

గుడివాడ అమర్నాథ్ కూడా చంద్రబాబును విమర్శిస్తూ, ఎద్దేవా చేస్తూ జగన్ దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ పార్టీలో తనకంటూ బలమైన వర్గం లేకపోవడం, ఆశించిన స్థాయిలో అంతర్గత మద్దతు లేకపోవడంతో ఆయన పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంటోంది.

మరో సీనియర్ నేత పేర్ని నాని మాత్రం వారిద్దరి కంటే కాస్త మెరుగైన స్థితిలో ఉన్నారు. జగన్‌కు సన్నిహితుడనే గుర్తింపు, పార్టీ వ్యవహారాలపై పట్టు, సాటి నాయకుల మద్దతు ఆయనకు కలిసొస్తున్న అంశాలు.

అందుకే జగన్‌కు అత్యంత అప్రియమైన అమరావతి అంశాన్నే ఎంచుకొని సిఎం చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పిస్తున్నారు.

వారి అధినేత జగన్ లక్ష్యం ముఖ్యమంత్రి కుర్చీ అయితే, ఆయన చుట్టూ ఉన్నవారి లక్ష్యం మాత్రం పార్టీలో నంబర్‌-2 కుర్చీ కావడం విశేషం.

ప్రజా సమస్యలను పక్కన పెట్టి అమరావతి, రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం కలిగించేలా తాము చేస్తున్న రాజకీయాలు రాష్ట్ర ప్రజలకు అర్థం కావడం లేదనుకుంటున్నారా? లేక ప్రజలు ఇవన్నీ గమనించడం లేదనుకుంటున్నారా? అనే సందేహం కలుగుతోంది.

ఒకవేళ వారు తెలిసి చేస్తున్నా, తెలియక చేస్తున్నా రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం కలిగిస్తున్న ఇలాంటి రాజకీయాల వలన చివరకు నష్టపోయేది మనమే అనే విషయం మాత్రం గుర్తుంచుకుంటే చాలు.

ADVERTISEMENT
Latest Stories