మరో రెండు రోజుల్లో కృష్ణా పుష్కరాలు ముగుస్తాయనంగా విజయవాడకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. గత తొమ్మిది రోజులుగా ఒత్తిడి లేకుండా సజావుగా సాగిపోతున్న పుష్కరాలలో పదవ రోజు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ ప్రభావం నదీ తీరాన కొలువై ఉన్న దుర్గ గుడిపై కూడా పడింది. కొండపై ఏర్పాటు చేసిన క్యూలైన్లన్నీ నిండిపోయి, భక్తుల వరుస కొండ దిగి, విజయవాడ హైవేలోని కుమ్మరిపాలెం జంక్షన్ వరకూ సాగింది.
[m9ad]
అలాగే కొండ దిగువన ఉన్న దుర్ఘా ఘాట్ లో స్నానం చేసిన భక్తులను మెట్ల మార్గం గుండా కొండపైకి వెళ్లేందుకు అనుమతించడం లేదు. వీరంతా కూడా దాదాపు కిలోమీటర్ దూరం నడిచి కుమ్మరిపాలెం కూడలి వద్ద క్యూ లైన్లోకి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో యాత్రికులు పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు. మరోవైపు విజయవాడలోని ఘాట్లన్నీ నిండిపోవడంతో, వస్తున్న రైళ్లను నగరం బయట ఏర్పాటు చేసిన శాటిలైట్ స్టేషన్లలోనే నిలుపుతూ, పుష్కర భక్తులను దింపుతున్నారు.
బస్సులను సైతం నగరంలోకి రానీయకుండా శివార్లలో ఏర్పాటు చేసిన పుష్కర నగర్ లకే పరిమితం చేస్తున్నారు. పుష్కరాలు చివరి అంకానికి చేరుకోవడం వలన మరియు ఆదివారం సెలవు రోజు కావడంతోనే భక్తుల రద్దీ భారీగా పెరిగిందని, మిగిలిన రెండు రోజుల్లో కూడా ఇదే ప్రభావం ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని, కాస్త ఆలస్యమవుతున్నప్పటికీ భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చూస్తామని అధికారులు చెప్తున్నారు.



