vimanam telugu movieథియేటర్లకు పబ్లిక్ రావాలంటే ఏం చేయాలనేది భేతాళ ప్రశ్న. అయినా చిన్న సినిమాలు తీస్తున్నారంటే కేవలం కంటెంట్ మీద నమ్మకమే. బలగం సక్సెస్ చూశాక మరికొందరికి ధైర్యం వచ్చేసింది. అందుకే స్టార్లు లేకపోయినా విమానంకి ప్రమోషన్లు ఘనంగా చేశారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా సముతిరఖనికి ఎంత పేరున్నా అతని కోసమే టికెట్లు కొనాలంటే చాలా బలమైన కారణం కావాలి. అందుకే విమానం ట్రైలర్ చూశాక దర్శకుడు శివప్రసాద్ యానాల ఎమోషన్ల మీద ఆధారపడే ఈ కథను తెరకెక్కించాడనిపిస్తుంది.

వీరయ్య(సముతిరఖని)కు అంగవైకల్యం. ఓ స్లమ్ ఏరియాలో బాగా పాతబడిన సులభ్ కాంప్లెక్స్ ని నడుపుకుంటూ కొడుకు రాజు(మాస్టర్ ధృవన్)ని స్కూల్లో చదివిస్తాడు. వాడికేమో విమానమంటే మహా క్రేజ్. బడికి లేటవుతున్నా సరే ఎయిర్ పోర్ట్ దగ్గర నిలబడి ఆకాశంలోకి చూస్తుంటాడు. ఒక్కసారైనా ఎక్కాలని ఆ చిన్ని మనసు తాపత్రయం. ఈలోగా వీరయ్య జీవితం కుదుపులకు లోనవుతుంది. ఎలాగైనా సరే రాజుని ఫ్లైట్ ఎక్కించాలని కంకణం కట్టుకుని దానికోసం ఎంత కష్టానికైనా సిద్ధపడతాడు.

Also Read – మద్యం కుంభకోణం: రాజకీయ కాలక్షేపమేనా?

విమానం మంచి కథే. పేపర్ మీద చదివినప్పుడు గుండె బరువెక్కుతుంది. కానీ రెండు గంటలకు సరిపడా సినిమాగా మలచాలనుకున్నప్పుడు కేవలం భావోద్వేగాలు సరిపోవు. పాత్రల మధ్య సంబంధాలు, సంఘటనలు ఇప్పటి ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా బలంగా ఉండాలి. శివప్రసాద్ ఒక్కో క్యారెక్టర్ ని డిటైల్డ్ గా చూపించే క్రమంలో సన్నివేశాలు నెమ్మదిగా సాగడంతో ప్రీ ఇంటర్వెల్ వరకు స్క్రీన్ ప్లే చాలా ఫ్లాట్ గా సాగుతుంది. ఒకరకంగా చెప్పాలంటే సీరియల్ కి షార్ట్ ఫిలింకి మధ్య ఊగుతుంది.

రాజుకి సంబంధించిన అసలు ట్విస్టు ఓపెన్ చేశాక వీరయ్య సంఘర్షణ మొదలవుతుంది. కానీ ఇక్కడ శివప్రసాద్ పేర్చుకున్న సంఘటనలు అన్నీ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కాలంలో అనిపిస్తాయి. దీనివల్ల నాటకీయతను ఈజీగా ఊహించేస్తాం. పని చేసే చోట వీరయ్య మీద దొంగతనం మోపబడటం లాంటి సీన్లు ఓల్డ్ ఏజ్ స్కూల్ నాటివి. గుండెలు పిండేసేలా చెప్పాలనుకున్నారు కానీ అవన్నీ ఊహాతీతంగా లేకపోవడంతో చాలా మాములుగా అనిపిస్తాయి. దీనివల్ల ప్రత్యేక అనుభూతి కలగడం లాంటివేమీ ఉండవు.

Also Read – కేసీఆర్‌ వైఖరిలో అనూహ్య మార్పులు.. ఏమవుతుందో?

విమానం నిస్సందేహంగా మంచి ప్రయత్నం. అందులో డౌట్ లేదు. కానీ థియేటర్ ఎక్స్ పీరియన్స్ డిమాండ్ చేస్తుందా అంటే సమాధానం చెప్పడం కష్టం. కేవలం క్లైమాక్స్ లో కళ్ళను తడిచేసే ఘట్టం కోసం మిగిలినదంత అంత సులభంగా ఆడియన్స్ అందరూ భరించలేకపోవచ్చు. రాహుల్ అనసూయ ట్రాక్ ని సరిగా డిజైన్ చేసుకోలేకపోవడం లాంటి మైనస్సులు మంచి రోడ్డు మీద గుంతలు పడేలా చేశాయి. సంగీతం, కెమెరా, ఎడిటింగ్ పనితనం గురించి పెద్దగా కంప్లైంట్ లేదు కానీ శివప్రసాద్ యానాల ఇదే తండ్రి కొడుకుల ఎమోషన్ ని కొంత నవ్యత జోడించి స్క్రీన్ ప్లే బలంగా బిగించి ఉంటే విమానం వేగంగా వెళ్ళేది. మధ్యలో ల్యాండ్ అవ్వాల్సిన అవసరం వచ్చేది కాదు.




Also Read – నువ్వు విష్ణువైతే.. నేను గంటా!