టీమిండియాకు నాయకత్వం వహించడమంటే సాధారణ విషయం కాదు. 130 కోట్ల మంది కళ్ళు ఆ ఒక్కడి పైనే ఉంటాయి. అలాంటి ఒత్తిడిని తట్టుకుని విజయవంతమైన కెప్టెన్లుగా అవతరించిన వారిలో సౌరవ్ గంగూలీ, మహేంద్ర సింగ్ ధోనిల పేర్లు ప్రధమంగా వినపడతాయి. ముఖ్యంగా ‘కూల్ కెప్టెన్’గా కెప్టెన్సీకి సరికొత్త నిర్వచనం ఇచ్చిన ధోని నాయకత్వం విమర్శకులు సైతం ప్రశంసించదగ్గది. కానీ, ప్రస్తుత పగ్గాలు విరాట్ కోహ్లి చేతిలో ఉన్నాయి. గంగూలీని మించిన రీతిలో కోహ్లి దూకుడైన నాయకత్వంలో టీమిండియా టెస్ట్ మ్యాచ్ లు, వన్డేలలో దూసుకుపోతోంది.
అయితే ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టీ 20 మ్యాచ్ లో మాత్రం బొక్కబోర్లా పడడం అభిమానులకు నిరాశ కలిగించింది. పేలవమైన ప్రదర్శనతో విమర్శల పాలైన ఈ మ్యాచ్ సెంటిమెంట్ ను పరిశీలిస్తే… టీ 20 సిరీస్ కూడా మనదే అన్న రీతిలో అభిమానులు రెచ్చిపోవడం ఖాయం. ఎందుకంటే, విరాట్ కోహ్లి నాయకత్వం వహించిన మొదటి మ్యాచ్ లు ఓటమి పాలు కావడం, ఆ తర్వాత విజయవంతమైన జట్టుగా నిలపడం ఆనవాయితీగా వస్తోందన్న విషయాన్ని టెస్టులు, వన్డే మ్యాచ్ లు స్పష్టం చేసాయి.
విరాట్ కోహ్లి కెప్టెన్ గా వ్యవహరించిన తొలి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా 48 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యింది. అలాగే కోహ్లి మొదటిసారిగా నాయకత్వం వహించిన వన్డే మ్యాచ్ లో కూడా టీమిండియా 161 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. అదే సెంటిమెంట్ ను అనుసరిస్తూ మొదటి టీ 20లో కూడా 7 వికెట్ల తేడాతో ఖంగుతింది. అయితే ఆ రెండు లక్ష్య చేధనలో ఓటమి పాలు కాగా, టీ20లో మాత్రం లక్ష్యాన్ని ఇచ్చి వెనుకడుగు వేయాల్సి వచ్చింది. సెంటిమెంట్ ప్రకారమే అయితే టెస్టులు, వన్డేల మాదిరే పడిలేచిన కెరటంలా, టీ20లోనూ జట్టును విజయవంతంగా తీసుకెళ్లడంలో విరాట్ కోహ్లి సక్సెస్ అవుతాడన్న మాట.
#M9NewsWin1000 contest every Wednesday – Answer our Question and win Rs 1000 Paytm Gift vouchers #contest2 pic.twitter.com/Yx6Z5Wql50
— M9News (@M9News) January 23, 2017



