విశాఖ రాజధాని కాకపోయినా అభివృద్ధి…జరుగుతోందే!

google-vizag

మంత్రి నారా లోకేష్‌ నేడు విశాఖలో మొట్టమొదటి ఎఐ ఎడ్జ్ డేటా సెంటర్, ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ నిర్మాణాలకు శంకుస్థాపన చేయబోతున్నారు. ప్రఖ్యాత సిఫీ టెక్నాలజీస్ అనుబంద సంస్థ సిఫీ ఇన్ఫినిట్ స్పెసస్ లిమిటెడ్ ఏఐ టెక్నాలజీతో పనిచేసే 50 మెగావాట్స్ సామర్ధ్యం కలిగిన ఎఐ ఎడ్జ్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తోంది.

ఈ ప్రాజెక్టు రెండో దశలో ఈ సంస్థ మరో రూ.1,500 కోట్లు పెట్టుబడి పెట్టబోతోంది. వీటి ద్వారా 1,000 మందికి ఉపాధి లభించబోతోంది.

ADVERTISEMENT

విశాఖ జిల్లాలోనే రైడెన్ ఇన్ఫోటెడ్ ఇండియా లిమిటెడ్ ఏకంగా రూ.87,520 కోట్లు పెట్టుబడితో 1,000 మెగావాట్స్ సామర్ధ్యం కలిగిన డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతోంది.

దీనికి ప్రభుత్వం జిల్లాలో మూడు ప్రాంతాలలో 480 ఎకరాలు రాయితీపై ఇవ్వబోతోంది. అన్ని రకాల రాయితీలు కలిపి మొత్తం రూ.22,002 కోట్లు అందించి ఈ సంస్థని విశాఖకు రప్పిస్తోంది.

విశాఖలో మరికొన్ని ప్రఖ్యాత కంపెనీలు కూడా డేటా సెంటర్స్, ఐటి కంపెనీలు ఏర్పాటు చేయబోతున్నాయి. వీటన్నిటి కోసం ముంబాయి నుంచి విశాఖ వరకు సముద్రగర్భంలో కేబిల్స్ కూడా వేయనున్నారు.

విశాఖలో ఏర్పాటు కాబోతున్న గూగుల్, ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి సంస్థలు ఎలాగూ భారీగా ఉద్యోగాలు కల్పిస్తాయి. అంతేకాదు… భారత్‌తో సహా వివిధ దేశాలకు ఐటి, డేటా సేవలు అందించబోతున్నాయి. తద్వారా రాష్ట్రానికి పన్నుల రూపంలో భారీగా ఆదాయం లభిస్తుంది.

గత ప్రభుత్వం విశాఖ రాజధాని అయితేనే విశాఖతో ఉత్తరాంధ్ర జిల్లాలు అభివృద్ధి చెందుతాయని వితండ వాదన చేసేది. కానీ 5 ఏళ్ళు పూర్తి మెజార్టీతో పాలించినా విశాఖని రాజధానిగా మార్చలేకపోయింది!

కూటమి ప్రభుత్వం విశాఖ రాజధాని కాదని అమరావతే రాష్ట్ర రాజధానినని ఖరాఖండీగా చెప్పింది. దానికే కట్టుబడి అమరావతి పునర్నిర్మాణ పనులను వేగవంతం చేసింది. కానీ అంత మాత్రాన్న విశాఖని, ఉత్తరాంధ్ర జిల్లాలను నిర్లక్ష్యం చేయలేదని విశాఖ జిల్లాకు రప్పిస్తున్న ఈ ఐటి కంపెనీలు, డేటా సెంటర్లతో నిరూపిస్తోంది.

విజయనగరం జిల్లా భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మిస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో మూలపేట వద్ద సీపోర్టు, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్, వాటికి అనుబందంగా 100 ఎకరాలలో చిన్న పట్టణాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు సిద్దం చేసింది. ఈ మూడు జిల్లాలను కలుపుతూ సముద్ర తీరం పక్కనే విశాలమైన ఆరు వరుసల రోడ్లు నిర్మించేందుకు కూడా ప్రణాళికలు సిద్దమవుతున్నాయి.

కనుక జిల్లాల అభివృద్ధి చేయాలంటే చిత్తశుద్ధి ఉండాలే తప్ప ప్రతీ చోట రాజధాని అవసరం లేదని స్పష్టమవుతోంది కదా?

ADVERTISEMENT
Latest Stories