Visakhapatnam-Metro-Rail

ఏ ప్రాంతానికైనా ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పిస్తే అక్కడి ప్రజలు తప్పక సంతోషిస్తారు. కానీ విశాఖని రాజధాని చేస్తామన్నా విశాఖ ప్రజలు పట్టించుకోలేదు. ఉత్తరాంధ్రా జిల్లాల ప్రజలు పట్టించుకోలేదు. ఎందువల్ల?

Also Read – వైసీపీ రాజకీయాలు మారాయి… మరి టీడీపీ?

అంటే అది జగన్‌ వల్ల కానిపని అనుకొని ఉండవచ్చు లేదా అమరావతి రాజధానిగా ఉండాలని విశాఖ ప్రజలు కోరుకోవడం వలన కావచ్చు లేదా విశాఖ నగరం అంత ఒత్తిడిని భరించలేదని కావచ్చు.

ఒకవేళ ఈ 5 ఏళ్ళలో జగన్‌ విశాఖలో రోడ్లు వెడల్పు చేయించి, ఎక్కడికక్కడ ఫ్లైఓవర్లు నిర్మింపజేసి, నగరంలో మౌలిక వసతులు మెరుగు పరిచి ఉండి ఉంటే విశాఖ ప్రజలు బహుశః స్వాగతించే వారేమో?

Also Read – అమరావతి టూ పొదిలి అంతా వ్యూహాత్మకమే?

కనీసం నగరానికి భారీగా పెట్టుబడులు, పరిశ్రమలు, ఐ‌టి కంపెనీలు, ప్రాజెక్టులు ఏర్పాటయ్యేలా చేసినా ప్రజలు విశాఖ రాజధాని ప్రతిపాదనను స్వాగతించి ఉండేవారేమో? కానీ ఋషికొండ ప్యాలస్‌ తప్ప మరేమీ చేయకుండా కాలక్షేపం చేసి జగన్‌ వెళ్ళిపోయారు!

చంద్రబాబు నాయుడు తొలిసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే విశాఖలో మెట్రో ప్రాజెక్టుకి కూడా రూపకల్పన చేశారు. దాని టెండర్ల ప్రక్రియ వరకు వచ్చాక ప్రభుత్వం మారి జగన్‌ రావడంతో అమరావతి, పోలవరంతో పాటు దానిని కూడా అటకెక్కించేశారు.

Also Read – కేసీఆర్‌ రాజకీయాలలో పాల్గొనగలరా?

ఇప్పుడు చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి కాగానే విశాఖ మెట్రో ప్రాజెక్టు పనులపై దృష్టి సారించారు. నగరంలో హైవే ఆధారిటీ 12 ఫ్లైఓవర్లు నిర్మించబోతున్నందున వాటితో సమన్వయం చేసుకుంటూ ప్రణాళికలు సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు.

అయితే మన దేశంలో ఎన్నో నగరాలలో మెట్రో ప్రాజెక్టులు దిగ్విజయంగా పూర్తిచేసి ‘మెట్రో గురూ’గా పేరొందిన శ్రీధరన్, మెట్రో ప్రాజెక్టు చాలా ఖరీదైన వ్యవహారమని, ఒక కిమీ మెట్రో ప్రాజెక్టు నిర్మాణానికి సుమారు రూ.450 కోట్లు వరకు ఖర్చు అవుతుందని పదేళ్ళ క్రితం చెప్పారు.కనుక ఆ లెక్కన ఇప్పుడు అది మరో 100-150 కోట్లు పెరిగి ఉండవచ్చు.

విశాఖలో కొమ్మాది నుంచి కూర్మన్నపాలెం వద్ద గల వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ వరకు 34.40 కిమీ మెట్రో వేయాలని ప్రతిపాదన. మరో మూడు కారిడార్లు కలిపి నగరంలో మొత్తం 76.05 కిమీ అవుతుంది. ఆ లెక్కన సుమారు రూ.40-50, 000 కోట్లు అవసరం.

శ్రీధరన్ మరో ముఖ్య విషయం కూడా చెప్పారు. మెట్రో నిర్మాణం కంటే నిర్వహణ వ్యయం భరించడమే తలకు మించిన భారం అవుతుందని చెప్పారు.

హైదరాబాద్‌ మహా నగరంలో రోజుకి అన్ని కారిడర్లలో కలిపి కనీసం నాలుగున్నర లక్షల మంది ప్రయాణిస్తుంటారు. కానీ 2021 లెక్కల ప్రకారం విశాఖలో 21 లక్షల జనాభా ఉండగా, మెట్రో కారిడార్లను పొడిగించడం ద్వారా 41 లక్షల మందికి అందుబాటులో ఉంటుందని అంచనా వేశారు.

హైదరాబాద్‌లో అనేక వందల పరిశ్రమలు, ఐ‌టి కంపెనీలు, జాతీయ అంతర్జాతీయ సంస్థలు, ఎక్కడికక్కడ వాణిజ్య సంస్థలు, మార్కెట్లు ఉన్నాయి. కనుక రోజుకి 4.5 లక్షల మంది ప్రయాణిస్తుంటారు.

కానీ విశాఖలో అన్ని పరిశ్రమలు లేవు… ఐ‌టి కంపెనీలు లేవు. కనుక విశాఖలో 21 లక్షల జనాభా ఉన్నప్పటికీ ప్రతీరోజూ వారిలో ఎంత మంది మెట్రోలో ప్రయాణిస్తారు?అనేది మెట్రో నిర్వహణకు చాలా కీలకం.

రోజుకి కనీసం 4.5 నుంచి 5 లక్షల మంది ప్రయాణిస్తే తప్ప మెట్రో నిర్వహణ లాభసాటి కాదని హైదరాబాద్‌ మెట్రో ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి చెప్పారు. రోజుకి 4.50 లక్షల మంది ప్రయాణిస్తున్నప్పటికీ, మెట్రో నిర్వహణ వ్యయం నానాటికీ పెరిగిపోతుండటంతో టికెట్‌ ఛార్జీలు పెంచేందుకు గత ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు కూడా.

ఈ లెక్కన విశాఖలో మెట్రో ఏర్పాటు చేస్తే నిర్వహణ వ్యయానికి సరిపడా ఆదాయం వస్తుందా రాదా? అనేది చాలా ముఖ్యం. ఒకవేళ రాకపోతే మెట్రో ఆరంభంలోనే దివాళా తీసే ప్రమాదం ఉంటుంది.

కనుక మెట్రో కంటే హైదరాబాద్‌ తరహాలో ఎంఎంటిఎస్ రైళ్ళు తక్కువ పెట్టుబడి, తక్కువ నిర్వహణ వ్యయం, తక్కువ ఛార్జీలతో నడిపించవచ్చని శ్రీధరన్ ఆనాడే చెప్పారు.




కనుక కాళేశ్వరం ప్రాజెక్టుపై మోజుతో కేసీఆర్‌ ప్రభుత్వంపై భారీగా భారం పెంచేసిన్నట్లుగా, మెట్రోపై మోజుతో ఏపీ ప్రభుత్వం భారం పెంచుకోవడం మంచికాదేమో?ఆలోచిస్తే మంచిది.