పెట్టుబడుల కోసం కాదు… ఎన్నికల కోసమే సదస్సు!

Vishnu_Vardhan_Reddy_AndhraPradesh_Global_ Investors_Summit_2023కాళ్ళ పారాణీ ఆరక ముందే అన్నట్లు, విశాఖలో రెండు రోజుల పాటు చాలా అట్టహాసంగా నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ కోసం వేసిన సెటింగ్స్ ఇంకా తీయనేలేదు…. అప్పుడే ప్రతిపక్షాలు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు కురిపిస్తూ, వాస్తవంగా ఎంత పెట్టుబడి వచ్చిందో, ఎక్కడెక్కడ ఏఏ పరిశ్రమలు ఎప్పటిలోగా ఏర్పాటుకాబోతున్నాయో తెలియజేస్తూ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి.

ADVERTISEMENT

టిడిపి, జనసేనలు వైసీపీతో రాజకీయంగా విభేదిస్తున్నాయి కనుక విమర్శించడం, పెట్టుబడుల గురించి నిలదీయడం సహజమే అనుకోవచ్చు. కానీ ఈ సదస్సులో పాల్గొన్న నితిన్ గడ్కారీ, కిషన్ రెడ్డి ఇద్దరు కేంద్రమంత్రులు ఈ సదస్సులో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పుష్కలంగా సహజవనరులున్నాయని, కనుక ఏపీలో పెట్టుబడులు పెట్టి వాటిని ఉపయోగించుకోవాలని, కేంద్ర ప్రభుత్వం అన్ని విదాలా తోడ్పడుతుందని పారిశ్రామికవేత్తలకు హామీ ఇచ్చారు. ఏపీ బిజెపి అధ్యక్షుడు సోమూ వీర్రాజు కూడా ఈ సదస్సు విజయవంతమవ్వాలని, ఏపీకి భారీగా పెట్టుబడులు, పరిశ్రమలు రావాలని కోరుతూ వైసీపీ ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేశారు కూడా. అంటే ఈ సదస్సు పెట్టుబడులను ఆకర్షించడానికే అని వారు దృవీకరించిన్నట్లు స్పష్టమవుతోంది.

అయితే ఏపీ బిజెపి ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి మాత్రం ఈ సదస్సు ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకొనేందుకే అని అన్నారు. నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకొన్న తర్వాత ఆయన కొండపై విలేఖరులతో మాట్లాడుతూ, “జగన్ ప్రభుత్వం ఎన్నికలని దృష్టిలో పెట్టుకొనే ఈ సదస్సుని నిర్వహించింది. గత ప్రభుత్వం విశాఖలో సదస్సు నిర్వహిస్తే అప్పుడు విమర్శలు గుప్పించిన జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు ఎందుకు సదస్సు నిర్వహించారు?అంటే ఎన్నికలలో ప్రజలని మభ్యపెట్టడానికే అని చెప్పుకోవలసి ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు రప్పించాలని ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండి ఉంటే గత మూడేళ్ళలో ఒక్కసారి కూడా ఎందుకు నిర్వహించలేదు?ఇప్పుడైనా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్లయితే ఈ సదస్సులో వచ్చిన పెట్టుబడులు, వాటితో ఏర్పాటవుతున్న పరిశ్రమల వివరాలను ప్రతీ మూడు నెలలకు ఓసారి శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తున్నాను,” అని అన్నారు.

ఈ రాజకీయ వాదోపవాదాలు, విమర్శలు ఎలా ఉన్నా, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్నాథ్ రెడ్డి సమక్షంలో రెండు రోజుల సదస్సులో ఏపీకి రూ.13.56 లక్షల కోట్ల పెట్టుబడులు, వాటితో 378 పరిశ్రమలు వాటిలో 6 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని అధికారికంగా ఎంవోయులు చేసుకొని మరీ ప్రకటించారు. కనుక వీటిని కూడా ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలుగానే ప్రజలు పరిగణించవలసిన అవసరం ఉంది.

ADVERTISEMENT
Latest Stories