రాజకీయ నేతలు వారి సొంత అభిప్రాయాలు పక్కన పెట్టి ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ అధినేత అభిప్రాయాలకు అనుగుణంగానే మాట్లాడుతుంటారు. అయితే ఆ పార్టీలో ఉన్నంతకాలం చెప్పలేకపోయిన తమ సొంత అభిప్రాయాలను పార్టీని వీడేప్పుడు తప్పక చెపుతుంటారు.
తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి కూడా అదే చేశారిప్పుడు. ఆమె వైసీపీలో ఉన్నంతకాలం జగన్ భజన చేస్తూ, మూడు రాజధానుల పాటలే పాడారు. కానీ పార్టీలో నుంచి బయటకు గెంటేసిన తర్వాత ఆమె అమరావతికి జై కొడుతున్నారు.
టిడిపి యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రలో భాగంగా నిన్న రావెల శివారులో ‘అమరావతి ఆవేదన సభ’ నిర్వహించారు. ఆ సభకు ఎమ్మెల్యే శ్రీదేవి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆమె అమరావతి కోసం ఉద్యమం చేస్తున్న రైతులను ఉద్దేశ్యించి మాట్లాడిన మాటలు విన్నప్పుడు, వైసీపీలో కేవలం శ్రీదేవి ఒక్కరే మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారా లేక ఎమ్మెల్యేలందరూ కూడా ఇదే అభిప్రాయాన్ని బయటకు చెప్పలేక మనసుల్లో దాచుకొన్నారా?అనే సందేహం కలుగక మానదు.
ఇంతకీ ఆమె ఏమన్నారంటే, “నేను వైసీపీ గుర్తుపై గెలిచి ఆ పార్టీలో ఉన్నందున మాట్లాడలేకపోయాను. వైసీపీలో ఉన్నందునే మీ ఉద్యమానికి వ్యతిరేకంగా మాట్లాడవలసి వచ్చింది. ఎన్నికలకు ముందు అమరావతే రాజధానిగా ఉంటుందని చెప్పి నమ్మబలికి గెలిచిన తర్వాత జగన్ మాట మార్చినా, మూడు రాజధానులంటూ మీ అందరినీ మోసం చేసినా నేను ధైర్యంగా మాట్లాడలేకపోయాను.
మా ప్రభుత్వం పోలీసులతో మీ అందరినీ వేధిస్తున్నా ఏమీ చేయలేక నిస్సహాయంగా చూస్తూ బాధపడేదానిని. మా పార్టీతో కలిసి నేను కూడా మీ అందరినీ మోసం చేస్తున్నాననే అపరాధభావన నా మనసులో తొలిచేస్తూ ఉండేది.
పరిస్థితులు కారణంగా అప్పుడు నేను మాట్లాడలేకపోయినా, ఇప్పుడు ఈ సభాముఖంగా రాజధాని రైతులందరికీ క్షమాపణ చెప్పుకొంటున్నాను. శిరస్సు వంచి చేతులు జోడించి నా తప్పును మన్నించి నన్ను క్షమించమని మీ అందరినీ కోరుతున్నాను. అప్పుడు మీకు అండగా నిలబడలేకపోయినా ఇకపై నేను మీతో కలిసి అమరావతి కోసం పోరాడుతాను. ఇకపై పోలీసులు మీజోలికి వస్తే నేను స్వయంగా వారిని ఎదుర్కొంటాను.
మూడు రాజధానుల పేరుతో ప్రజలను మభ్యపెడుతున్న జగన్మోహన్ రెడ్డిని గద్దె దించి అమరావతి రాజదాని నిర్మించాలనుకొంటున్న చంద్రబాబు నాయుడుని, టిడిపిని గెలిపించుకొందాము. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే మళ్ళీ అమరావతి నిర్మాణపనులు మొదలవుతాయి.
వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తే మరో 5 ఏళ్ళపాటు మూడు రాజధానులంటూ కాలక్షేపం చేసేస్తుంది. అప్పటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిస్థితి మరింత దయనీయంగా మారుతుంది. కనుక వచ్చే ఎన్నికలలో టిడిపిని 175 సీట్లు ఇచ్చి గెలిపించుకొని అమరావతి నిర్మించుకొందాము,” అని వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి అన్నారు.





