పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన ఓ విషాద ఘటన ఆలోచింపజేస్తుంది. ముందుగా ఏం జరిగిందో తెలుసుకుందాం.
జిల్లాలోని తణుకు మండలం వేల్పూరుకు చెందిన దొడ్డా సాయి (29), శిరీష (28) దంపతులు గురువారం రాత్రి తమ మూడేళ్ల కుమార్తెతో కలిసి స్కూటీపై చించినాడ వశిష్ఠ బ్రిడ్జి వద్దకు వచ్చారు. అక్కడ పాపను స్కూటీపై ఒంటరిగా ఉంచి వారిద్దరూ గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.
అంత రాత్రిపూట.. ఆ చీకట్లో స్కూటీపై ఒంటరిగా ఉన్న ఆ పాప భయంతో ఏడుస్తుంటే దారిన పోయేవారు చూసి షాక్ అయ్యారు. పోలీసులకు సమాచారం ఇచ్చి ఆ పాపను ఎత్తుకుని ఓదార్చారు. ఆ తర్వాత జరిగేది అందరికీ తెలిసిందే.
ఈ దంపతుల ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులు, భార్యాభర్తల మధ్య విభేదాలు, మరేవైనా సమస్యలు కారణం కావచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న భార్యాభర్తలు తమ సమస్యలు.. వాటితో తాము అనుభవిస్తున్న మానసిక వేదన గురించే ఆలోచిస్తుంటారు.
కానీ తల్లిదండ్రులే తమ పిల్లలను పట్టించుకోకుండా ఆత్మహత్య చేసుకున్నప్పుడు.. ఆ పిల్లలను బంధుమిత్రులు ఎందుకు పట్టించుకోవాలి? ఎవరూ పట్టించుకోకపోతే వారెలా జీవిస్తారు? భార్యాభర్తల సమస్య తీవ్రత కంటే.. హఠాత్తుగా తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు కలిగే షాక్, మానసిక ఆందోళన, వారి జీవితాలపై దాని ప్రభావం గురించి ఆలోచించేవారు ఎందరు?
అందరూ ఇంత దూరం ఆలోచించలేకపోవచ్చు. కానీ తాము ఆత్మహత్య చేసుకుంటే తమపైనే ఆధారపడిన తమ పిల్లల పరిస్థితి ఏమవుతుంది? అని ఒక్కసారి ఆలోచించగలరు కదా?
కొందరు ఇలా ఆలోచించి అల్లారుముద్దుగా పెంచుకున్న పిల్లలకు విషం పెట్టి లేదా వారితో కలిసి నూతిలోనో, చెరువులోనో దూకి ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇది ఇంకా విషాదమే అవుతుంది.
పిల్లలకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు వారిని పెంచి, విద్యాబుద్ధులు నేర్పించాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ పిల్లల ప్రాణాలు తీసే హక్కు వారికి ఉండదు కదా?
అభం శుభం తెలియని పిల్లలకు ఎంతో జీవితం ఉంటుంది. తల్లిదండ్రుల సమస్యల కారణంగా ఆ జీవితాన్ని వారే చిదిమేయడం న్యాయమా? తమ పిల్లలకు వారు ఉజ్వల భవిష్యత్తు ఇవ్వకపోయినా పర్వాలేదు. కానీ తమ సమస్యల కోసం పిల్లల బాల్యాన్ని నరకంగా మార్చే హక్కు ఏ తల్లిదండ్రులకు ఉండదు.
ఆత్మహత్య చేసుకునేవారు ఒక్కసారి ‘ఈ లోకంలో కేవలం మనం మాత్రమే ఇన్ని కష్టాలు, సమస్యలు ఎదుర్కొంటున్నామా? వేరెవరికీ ఏ కష్టాలు లేవా? అందరూ సుఖ సంతోషాలతోనే జీవిస్తున్నారా?’ అని ఆలోచిస్తే.. బహుశా ఇలాంటి నిర్ణయం తీసుకోకుండా సమస్య నుంచి బయటపడేందుకు మరో మార్గం వెతికేవారు.





