బీసీ కార్పొరేషన్లు ఏం సాధించాయి? ఎవరు బాగుపడ్డారు?

BC Corporationsబీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తే వారిని ఉద్దరించినట్లేనా? అనే చర్చ ఇప్పుడు రాష్ట్రంలో జోరుగా సాగుతోంది. అందుకు కారణం బీసీలకి ఏమీ చేయకుండానే బీసీ కార్పొరేషన్ల రెండేళ్ళ పదవీకాలం ముగిసిపోతోంది కనుక. ప్రభుత్వం వాటి పదవీకాలం మరో రెండేళ్ళు పొడిగించినా వాటితో వైసీపీలో రాజకీయ నిరుద్యోగులకి పదవులు, జీతభత్యాలు చెల్లించడానికి మాత్రమే ఉపయోగపడుతున్నాయి తప్ప రాష్ట్రంలో బీసీ ప్రజలకి కాదని స్పష్టమయ్యింది.

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమ ప్రభుత్వం బీసీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని నిరూపించేందుకు 2020 డిసెంబర్‌లో 136 బీసీ కులాల కోసం 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. వాటికి 12 మంది డైరెక్టర్లను కూడా నియమించింది. కనుక అప్పటి నుంచి రాష్ట్రంలో 136 కులాల ప్రజల బాగోగులు అవి చూసుకొంటున్నాయనుకోవడం సహజం.

ADVERTISEMENT

వాటి చైర్మన్లు ఒక్కొక్కరికీ నెలకి రూ.56,000 గౌరవ వేతనం, టీఏ, డీఏల కింద మరో రూ.60,000 చొప్పున చెల్లిస్తోంది. ఇక డైరెక్టర్లకు, వారి సహాయకులకి నెలకు రూ.12,000 చొప్పున గౌరవ వేతనం చెల్లిస్తోంది. అంటే 56 కార్పొరేషన్లకి కలిపి ఈ రెండేళ్లలో ప్రభుత్వం ఎన్ని కోట్లు ఖర్చు చేసిందో ఊహించుకోవచ్చు. కానీ ఈ రెండేళ్ళలో అవి చేసిందేమీ లేదు కానీ బీసీల కోసం తమ ప్రభుత్వం ఏకంగా 56 కార్పొరేషన్లు ఏర్పాటుచేసిందని సిఎం జగన్‌, మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పుకోవడానికి మాత్రం పనికివచ్చాయి. కనుక వాటిని తమ కోసమే ఏర్పాటు చేశారా లేక వైసీపీ రాజకీయ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకే ఏర్పాటు చేశారా? అని అప్పుడే అందరికీ అనుమానం కలిగింది.

అసలు తాము ఏం పని చేయాలో తెలీని పరిస్థితిలోనే చైర్మన్లు, డైరెక్టర్ల పదవీ కాలం ముగిసిపోతోంది. వాటితో బీసీలు బాగుపడలేదు కానీ వారు మాత్రం ఏ పని చేయకుండానే నెలనెలా జీతభత్యాలు అందుకొన్నారు. అందుకు వారిని తప్పు పట్టలేము. ఒక వ్యవస్థని, యంత్రాగాన్ని ఏర్పాటు చేయాలంటే ముందు నిబద్దత ఉండాలి. చాలా దూరదృష్టితో ఆలోచించి అవసరమైన కార్యాచరణ, అందుకు తగ్గ నిధులు అందజేస్తుండాలి. కానీ తాంబూలాలు ఇచ్చేశామన్నట్లు బీసీలకి కార్పొరేషన్లు ఏర్పాటు చేసేశాము మా పనైపోయిందన్నట్లు ప్రభుత్వం వ్యవహరించడం వలన వాటితో ఎటువంటి ప్రయోజనం లభించకపోగా వాటితో ప్రభుత్వంపై అదనపు భారం పడింది. ప్రభుత్వానికి నిబద్దత లేకపోవడం వలననే బీసీ కార్పొరేషన్లు ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయాయి. చివరికి ఏమీ చేయకుండానే పదవీకాలం కూడా పూర్తయిపోతోంది. అందుకే ప్రతిపక్షాలు వేలెత్తి చూపి విమర్శిస్తున్నాయి.

ADVERTISEMENT
Latest Stories